హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రెండో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనిచ్చిందన్న కారణంతో భార్య, ఇద్దరు పిల్లలను మూడు లక్షలకు అమ్మేశాడు ఓ కసాయి భర్త. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. ఆ బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్ రహమాని, ఇష్రత్ పర్వీన్ భార్యాభర్తలు. 2016లో పెళ్లైన వీరికి రెండేళ్ల పాప ఉంది. నాలుగు నెలల క్రితం పర్వీన్ మరో అమ్మాయికి జన్మనిచ్చింది. అయితే రెండోసారి కూడా తన భార్యకు ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన రహమాని.. తన తల్లిదండ్రులతో కలిసి పర్వీన్‌ను వేధించడం మొదలుపెట్టాడు. దీనిపై పర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటినుంచి తన తల్లిదండ్రులతో కలిసి రహమాని విడిగా ఉంటున్నాడు.
అయితే మూడు రోజుల క్రితం పర్వీన్ ఇంటికొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పర్వీన్, ఆమె పిల్లలను రహమాని తమకు రూ.3లక్షలకు అమ్మేశాడని వారు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే తేరుకొని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తరువాత ప్రశ్నించి విడిచిపెట్టారు. పోలీసుల తీరును బాధితురాలి బంధువులు తప్పుపడుతున్నారు.