
హైదరాబాద్, జులై 26: హైదరాబాద్ నగరానికి మరో రూపాన్ని ఇవ్వాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 3డీ డిజిటల్ మోడల్‌గా తీర్చిదిద్దే పనిలో హెచ్‌ఎండీఏ నిమగ్నమైంది. ఈ డిజిటల్ ట్విన్ ద్వారా నగరాన్ని రియల్టైంలో వీక్షించవచ్చు. అంటే, నగరంలోని ఏ ప్రాంతాన్ని అయినా 3డీ విజువల్స్‌లో చూసే అవకాశం లభిస్తుంది.
డిజిటల్ ట్విన్ అనేది నగరానికి ఒక 3డీ డిజిటల్ ప్రతిరూపం. దీనివల్ల భవనాలు, రోడ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి, వాటిపై పకడ్బందీ ప్రణాళిక రూపొందించవచ్చు. ఉదాహరణకు, ఓ ఇంటిని లేదా ప్రాంతాన్ని చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా… డిజిటల్ మోడల్‌లోనే ఆ ప్రాంతాన్ని రియల్టైంలో చూడవచ్చు. కోహిమా, కాన్పూర్, ముంబయి, కొచ్చి నగరాలు ఇప్పటికే డిజిటల్ ట్విన్‌ను అభివృద్ధి చేసుకుని వినియోగంలోకి తీసుకొచ్చాయి. త్వరలోనే హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
ఇవి అగ్ని ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌ల సమయంలో అధికారులు స్పందించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంబులెన్సులు, పోలీసు బలగాలు, అగ్నిమాపక దళాలు సమన్వయంతో పనిచేయగలుగుతాయి. రోడ్లు, భవనాలు, పార్కులు నిర్మించేముందే వాటి రూపాన్ని గణనీయంగా విశ్లేషించవచ్చు. ఏఐ, 5జీ, 6జీ, ఆధునిక అల్గారిథమ్స్‌తో ఈ మోడల్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దనున్నారు. డిజిటల్ ట్విన్ ప్రాజెక్టులో భాగంగా 3డీ స్కానర్లు, డ్రోన్ల సాయంతో నగరాన్ని పూర్తిగా మ్యాప్ చేయనున్నారు. రెవెన్యూ, జలమండలి, విద్యుత్తు, రవాణా తదితర శాఖల సమాచారం ఒకేచోట సమీకరించి నగర ప్రణాళికను రూపొందించనున్నారు. వర్షాలు, వరదలు, ట్రాఫిక్ సమస్యలు, అనుకున్న విపత్తులను ముందుగానే ఊహించి, డిజిటల్ మోడల్‌లో ప్రత్యామ్నాయ మార్గాలు, స్పందన ప్రణాళికలను రూపొందించవచ్చు. ఈ డిజిటల్ మోడల్ ద్వారా నగర ప్రణాళికకు స్పష్టత వచ్చి, విభాగాల మధ్య సమన్వయంతో మెరుగైన పరిపాలన సాధ్యమవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.