AP – Telangana Rains Highlights: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పొంగుతున్న వాగులు, వంకలు

| Edited By: Subhash Goud

Sep 05, 2023 | 6:14 PM

Hyderabad Rains Live updates: తెలుగు రాష్ట్రాలను వాన ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నాన్ స్టాప్ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్ టు మియాపూర్.. ఉప్పల్ టు మెహిదీపట్నం.. అన్ని చోట్ల భీకర వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌లో విద్యా సంస్థలకు ప్రకటించింది ప్రభుత్వం.

AP - Telangana Rains Highlights: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పొంగుతున్న వాగులు, వంకలు
Rain Alert

వానలతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతుంది..దీంతో ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మోకాళ్ల లోతు నిలిచిన నీటితో జనం ఇబ్బంది పడుతున్నారు.లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే మరో మూడురోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది..తెలుగురాష్ట్రాల్లో అసలు ఏఏ జిల్లాలకు ఏ వార్నింగ్‌ ఉందో ఇప్పుడు చూద్దాం.

– తెలంగాణలో ఏ జిల్లాలకు ఆరెంజ్‌ వార్నింగ్‌, ఏ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ ఉందో ఒకసారి చూద్దాం

== ఆరెంజ్‌ అలర్ట్‌ – జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు

== ఎల్లో అలర్ట్‌ – ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట్‌, గద్వాల, మల్కాజ్‌గిరి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి,నల్గొండ, సూర్యాపేట, వనపర్తి

== == == == ==

ఆంధ్రాలో రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇష్యూ చేసింది. అసలు ఏఏ జిల్లాలకు ఏ వార్నింగ్‌ ఉందో చూద్దాం.

== ఆరెంజ్‌ అలర్ట్‌ – శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు

== ఎల్లో అలర్ట్‌ – విశాఖ, ఏలూరు, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Sep 2023 01:58 PM (IST)

    అనంతగిరి ఘాట్‌ రోడ్డులో విరిగిపడ్డ చెట్లు

    వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతగిరి ఘాట్‌ రోడ్డులో చెట్లు విరిగిపడ్డాయి.. తాండూరు వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. అక్కడికి చేరుకున్న అధికారులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. రూట్‌ క్లియర్‌ చేశారు.. మరోవైపు, పరిగి-వికారాబాద్‌ మధ్య చిట్టెంపల్లి, నస్కల్‌ వాగులు రోడ్డును ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి.. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

  • 05 Sep 2023 01:26 PM (IST)

    హైదరాబాద్‌ అల్లకల్లోలం

    హైదరాబాద్‌ అల్లకల్లోలంగా మారింది. ఎక్కడ చూసినా, ఎటుచూసినా జల విలయమే. కాలనీలకు కాలనీలే నీటముగిగాయ్‌. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయ్‌. రోడ్లపై ఓ రేంజ్‌లో నీరు పారుతుంది. శ్రీనగర్‌ కాలనీలో వరదలో చిక్కుకుని ఆగిపోయిన బస్సును GHMC డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ కష్టపడి బయటకు తోశారు.. ఇక ఆరాంఘర్‌లోనూ వరద ఉధృతిలో బస్సు ఆగిపోయింది.అటు ఫతేనగర్‌-బేగంపేట దగ్గర కూడా వరదకు రోడ్లు చెరువులు అయ్యాయి..అంబులెన్స్‌ మధ్యలోనే ఆగిపోయింది. ఎక్కడికక్కడ మ్యాన్‌హోల్స్‌ బ్లాక్ అవుతున్నాయి.. మలక్‌పేట, మాదాపూర్‌, కష్ణానగర్‌ ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి,. DRF టీమ్‌లు ఎప్పటికప్పుడు బ్లాకేజ్‌లు క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.హైదరాబాద్‌ ప్రజలకు హైఅలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ.

  • 05 Sep 2023 11:02 AM (IST)

    ఎడతెరిపి లేని వర్షం

    నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రేపటి వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరిక నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు మేయర్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తిన నేపథ్యంలో మూసీ నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్‌లకు ఆదేశించారు. హెల్ప్ లైన్‌కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.

  • 05 Sep 2023 10:10 AM (IST)

    Hyderabad Floods: జలదిగ్బంధం

    ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనిలేదు!, ఏ ఏరియా చూసినా జలదిగ్బంధమే!. వర్ష బీభత్సానికి అనేక చోట్ల వాహనాలు సైతం కొట్టుకుపోయాయ్‌!. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. బైక్లు, కార్లు ఆగిపోవడంతో తిప్పులు పడుతున్నారు హైదరాబాదీలు.

  • 05 Sep 2023 10:03 AM (IST)

    అల్లకల్లోలంగా హైదరాబాద్

    హైదరాబాద్‌ అల్లకల్లోలంగా మారింది!. ఎక్కడ చూసినా, ఎటుచూసినా జల విలయమే!. తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలకు కాలనీలే నీటముగిగాయ్‌!. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయ్‌!. రోడ్లన్నీ కాలువల్లా మారాయ్‌!. మోకాల్లోతు నీరు చేరడంతో హైదరాబాద్‌ ప్రజలు విలవిల్లాడుతున్నారు.

  • 05 Sep 2023 09:37 AM (IST)

    Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

    తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.ఏకధాటిగా పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా భారీవర్షంతో చెట్లు విరిగి పడడంతో గంటపాటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు..జిల్లాలో భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు ఎక్కడ చూసినా నీరు నుంచి జనజీవనం స్తంభించింది.

  • 05 Sep 2023 09:14 AM (IST)

    ఆగని జోరువాన

    భారీ వర్షంతో హైదరాబాద్‌ అల్లాడింది. వాన హోరుతో విలవిల్లాడింది. కుండపోతతో నగరం నిలువెల్లా వణికింది. మార్నింగ్ 4 గంటల 15 నిమిషాలకు మొదలైన వాన ఆగకుండా పడుతూనే ఉంది.భారీ వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. మార్నింగ్‌ షిఫ్ట్‌ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కార్యాలయం నుంచి తిరిగి వచ్చే వారు ముప్పుతిప్పలు పడ్డారు.

  • 05 Sep 2023 09:12 AM (IST)

    పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు

    అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రాత్రి ప్రారంభమైన వర్షం ఇప్పటికీ తగ్గలేదు. పడుతూనే ఉంది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. తెలంగాణలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ. వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.

  • 05 Sep 2023 09:08 AM (IST)

    Hyderabad Rains: కుండపోత వర్షం

    హైదరాబాద్‌ను  కుండపోత వర్షం ముంచెత్తింది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ 2 గేట్లు ఎత్తివేశారు.  మూసీ పరివాహక ప్రాంతాలకు అలెర్ట్ ప్రకటించారు అధికారులు.  వరద తీవ్రతపై  బల్దియా అప్రమత్తమైంది. వరద పెరిగితే బస్తీ వాసులను ఖాళీ చేయించే యోచన చేస్తుంది.

Follow us on