
హైదరాబాద్, మే 27: హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరంలో కురుస్తోంది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భరీగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు.
మరోవైపు వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోహిణీ కార్తి ప్రభావంతో గత రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా ఉన్న నగరం తాజా జల్లులతో చల్లబడింది. ఎండలకు తల్లడిల్లిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోనూ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండడంతో సంగారెడ్డిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులు ఆరు బయట ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షానికి ధాన్యం తడిచిపోయింది. నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలలో భారీగా జల్లులు కురిశాయి. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11సెం.మీ, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4సెం.మీ, మహబూబ్‌నగర్‌లో 7.5 సెం.మీ, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములుమెరుపులతో కూడిన వర్షం పడింది. రాత్రి నుంచి చిరు జల్లులు కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో భారీ వర్షం పడింది. నాలుగు గంటలపాటు ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో.. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు డ్రైనేజీ ఉప్పొంగి.. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలడంతో రహదారులపై రాకపోకలకు జనం ఇబ్బంది పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాత్రి ఉరుములు,మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో ములకలూరు నుండి సత్తెనపల్లి మార్గంలో చెట్లు,కరెంట్ స్తంభాలు నేల కూలాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు చిలకలూరిపేట మండలం దండముడిలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలుకు సోలార్ ప్లేట్లు ఎగిరిపడి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
తెలుగురాష్ట్రాల్లో ఒకవైపు మండిపోతున్నాయి. ప్రాణాలు తీస్తున్న ఎండాకాలంలో జనానికి రిలీఫ్ ఇచ్చేలా వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా భారీవర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.