Crime News: హైదరాబాద్‌లో కలకలం రేపిన మ్యాట్రీమోనీ మోసగాడు శివశంకర్ బాబుని పోలీసులు విశాఖ(Vizag)లో అరెస్టు చేశారు. ఒకటో రెండో కాదు. ఏకంగా ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిల జీవితాలతో ఆటాడుకున్న నిత్య పెళ్ళికొడుకు శివశంకర్ బాబుని గురువారం కోర్టుముందు హాజరుపరచనున్నారు. ఈనెల 13వ తేదీన కొండాపూర్(Kondapur)కి చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఘరానా మోసగాడైన నిత్యపెళ్ళికొడుకు బండారం బట్టబయలైంది. తనను పెళ్ళి చేసుకొని 30 లక్షల రూపాయల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలను నమ్మించి, మాయమాటలతో వలవేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నదంతా గుంజేస్తాడు. పనైపోయాక ఉడాయిస్తాడు. ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి నిలదీస్తే అమెరికా అనీ, ప్రాసెసింగ్ అనీ ఏదో సోది చెప్పి మాటల గారడి చేసేస్తాడు. ఇతగాడి వరుస పెళ్ళిళ్ళ వలకు చిక్కిన మహిళలు శివశంకర్‌ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మోసగించి పెళ్ళి చేసుకొని, తన నుంచి 32 లక్షల నగదు, బంగారం కాజేశాడంటూ ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యపెళ్ళి కొడుకు మోసాలు తీగలాగితే డొంకకదిలినట్టు పుట్టలు, పుట్టలుగా బయటపడుతున్నాయి. మాట్రిమోనీ సైట్‌లలో రెండో వివాహం చేసుకున్న మహిళలే టార్గెట్‌గా వరుసగా ఒకరి తర్వాత ఒకరిని పెళ్ళి చేసుకొని లక్షల్లో డబ్బులు గుంజి తప్పించుకు తిరుగుతోన్న అడపా శివశంకర్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో చోట ఒక్కో అవతారమెత్తి జనం నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నాడు ఈ ఘరానా మోసగాడు. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానని మూడు లక్షలు వసూలు చేసినట్టు మాదాపూర్ పీఎస్‌లో కూడా ఇతగాడిమీద ఓ కేసు నమోదైంది. ఇంకా ఎవరైనా ఇతడి మోసాలకు గురైనవారుంటే సమీప పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ ఏసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నిత్యపెళ్ళికొడుకు ఇప్పటి వరకు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు తేలింది. అయితే ఇంకా ఎంతమందిని మోసం చేశాడనేది తేలాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి