Telangana: హైదరాబాద్ మహానగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి రానుంది. అయితే ఇది అన్నింటికంటే డిఫరెంట్. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంజారా హిల్స్(Banjara Hills) రోడ్ నెంబర్ 1లోని GVK మాల్ వద్ద రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో త్రీడీ ఎఫెక్ట్‌తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. GVK మాల్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. వాణిజ్య సముదాయాలు, మాల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు రోడ్డు దాటే సందర్భంగా పలు ప్రమాదాలు సంభవిస్తున్న దృష్ట్యా అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని నిర్మాణం కోసం రూ. 5 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నూతన టెక్నాలజీతో ఆకర్షణీయంగా బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. మైల్డ్ స్టీల్‌తో సుమారు 55 (54.97) అడుగుల విస్తీర్ణంతో చేపట్టే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన ప్రజల సులభతరంగా రోడ్డు దాటే అవకాశం ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జికి రెండు వైపులా ఎస్కలేటర్స్ ఉంటాయి. ఇరువైపులా 10 మంది కెపాసిటీ గల రెండు లిఫ్టులు, 8 సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫుట్ పాత్ అంచున సీలింగ్, క్లాడింగ్ ఏర్పాటు చేస్తారు. 3 డి ఎఫెక్ట్ తో అధునాతన పద్ధతిలో దీని నిర్మాణం చేపడుతున్నారు. GVK మాల్ వద్ద నిర్మించే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వలన పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.
పాదచారుల ప్రయోజనం కోసం GHMC పరిధిలో ఇప్పటికే ఎన్నో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో… వాణిజ్య సముదాయాలు, మాల్స్ ఉన్న ప్రదేశాలలో పాదచారులు ఇరువైపులా వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇరువైపులా రోడ్డు దాటే సందర్భంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదాల నివారణ కోసం ఖర్చుకు వెనుకాడకుండా.. జిహెచ్ఎంసి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాదచారులను దృష్టిలో పెట్టుకొని ఇరువైపులా రోడ్డు దాటేందుకు ఇప్పటికే సుమారు 43 పైగా పనులు చేపట్టారు. అందులో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయి. మరో 4 చోట్ల వివిధ కారణాల వలన పనులు చేపట్టలేదు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటితో పాటు సుమారు 33 కోట్ల వ్యయంతో పాదాచారుల కోసం 12 జంక్షన్ల అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. సుందరీకరణ, గార్డెన్, కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. కొన్ని పనులు కొన్ని టెండర్ దశలో ఉండగా.. మరికొన్ని టెండర్ ప్రక్రియ పూర్తై పనులు కూడా ప్రారంభం అయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..