Hyderabad: ఓ గోడౌన్‌లో పోలీసుల తనిఖీలు.. గోడల చాటున కనిపించనవి చూసి షాక్
గంజాయిని ఆనవాళ్లు రాష్ట్రంలో అస్సలు కనిపించకుండా చేయాలని తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. గంజాయి మూలాలు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టడం లేదు.
తెలంగాణలో గంజాయి మాట వినిపిస్తే చాలు.. పోలీసులు క్షణాల్లో వాలిపోయి.. ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసుల ముప్పేట దాడులతో గంజాయి స్మగ్లర్లు కూడా వణికిపోతున్నారు. తాజాగా.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని దూలపల్లిలో మొక్కలు పెంచుతోన్న ఓ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. గోడౌన్ లోపల ఖాళీ ప్రదేశంలో గంజాయి మొక్కలను పెంచుతున్నారన్న సమాచారంతో కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ధ్వంసం చేశారు. దూలపల్లిలోని స్మస్తిక్ స్టీల్ కంపెనీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు.
సొంతూరు నుండి హైదారాబాద్ వచ్చేప్పుడు గంజాయి విత్తనాలు తీసుకొచ్చిన వికాస్.. కంపెనీ ఆవరణలో నాటాడు. దాంతో.. కొద్దిరోజుల్లోనే గంజాయి మొక్కలు నాలుగు అడుగులకు వరకు పెరిగాయి. అయితే.. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. గంజాయి మొక్కలు పీకిపడేసి.. వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ కాంపౌండ్‌లో నిషేధిత గంజాయి మొక్కలు పెంచడంతో ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వికాస్‌ను రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..