Ganesh Nimajjanam: 12 వేల మందితో పోలీసు బందోబస్తు.. సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలు

|

Sep 09, 2022 | 7:53 AM

Ganesh Nimajjanam: జంట నగరాల్లోని గణనాధులు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. నిన్న రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఇప్పటి వరకు..

Ganesh Nimajjanam: 12 వేల మందితో పోలీసు బందోబస్తు.. సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలు
Ganesh Nimajjanam
Follow us on

Ganesh Nimajjanam: జంట నగరాల్లోని గణనాధులు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. నిన్న రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఇప్పటి వరకు మంటపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు..ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నాయి. గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై భారీగా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గ్‌లో మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

భాగ్యనగరంలో ఇవాళ జరగబోయే నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్దమైంది. 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసారు అధికారులు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనులు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు సిద్ధమయ్యాయి. 168 GHMC గణేశ్ యాక్షన్ టీమ్స్‌ రెడీ కాగా.. 12 వేల మంది పోలీసులు, 10 వేల మంది శానిటేషన్ కార్మికులు విదుల్లో పాల్గొననున్నారు.

ఇటు.. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాతబస్తీలో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాతబస్తీ-బాలాపూర్‌ గణేశ్‌ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఎలక్ట్రిక్ సిటీ, GHMC డిపార్ట్‌మెంట్ రూట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్, సిమెంట్ బారికేడ్లను తొలగించారు.

ఇవి కూడా చదవండి

ఇదే సమయంలో హైదరాబాదీ ముస్లింలకు మతపెద్దలు పిలుపునిచ్చారు. గంగాజమునా తెహజీబ్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో శాంతి, ప్రశాంతతకే పెద్దపీటన్నారు ముస్లిం మతపెద్ద కుబూల్‌ పాషా షిత్తారీ. ఇవాళ నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడికక్కడ స్థానిక మసీదుల్లోనే చేసుకోవాలని సూచించారు. ఖైదరాబాద్‌ మహా గణపతికి నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు. గణపతిని స్థానభ్రంశం చేసింది ఉత్సవ సమితి. నిన్న తొమ్మిదో రోజు కావడంతో గణపతిని ప్రతిష్టించిన స్థానం నుంచి కదిపారు. ఇప్పటికే ఖైదరాబాద్‌ గణపతి దగ్గర గ్యాలరీలను తొలగించారు. కాసేపట్లో భారీ గణపతిని లారీ మీద ఎక్కించే ప్రక్రియ జరుగుతుంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి