హైదరాబాద్‌లో నమోదవుతున్న హిట్ అండ్ రన్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లో నమోదైన వరుస హిట్ అండ్ రన్ కేసుల్లో పలువురు మృత్యువాత పడ్డారు. యాక్సిడెంట్స్ చేసిన వ్యక్తులపై పోలీసులు మర్డర్ కేస్ నమోదు చేశారు.
తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ కార్.. రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు బైక్‌పైన వెళ్తున్న అన్నా చెల్లెలు ఉదయ్, సుష్మాలను వెనుక నుండి స్పోర్ట్స్ కార్ ఢీ కొట్టింది. ఈ కేసులో నిందితులు ఐడెంటిఫై కాలేదు. సీసీటీవీ ఫుటేజ్‌లో కార్ నంబర్ గుర్తించారు పోలీసులు. AP 07CY 3113 నంబర్ గల కారు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులదిగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా కాటమూరుకి వెళ్లింది జూబ్లీహిల్స్ పోలీసుల బృందం. గాయపడ్డ బాధితులు మాదాపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో డ్యూటీ ముగించుకుని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వెర్నా కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా పటాన్‌చెరువు వైపు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో బౌన్సర్‌గా పనిచేసే తారక్ అనే యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. మరో యువకుడు రాజు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గంట వ్యవధిలోనే సీసీ ఫుటేజ్ సాయంతో కారు నెంబర్ గుర్తించి.. నిందితుడు రిత్విక్ రెడ్డితో పాటు కారులో ప్రయాణించిన మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు.
ఇదిలా ఉండగానే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సాప్ట్‌వేర్ ఉద్యోగి వాహనం నడుపుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందిని ఢీకొట్టాడు. కారు ఆపకుండా పరారయ్యాడు. ఇతనిపై కూడా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు పోలీసులు. VIP జోన్‌లలోనే హిట్ అండ్ రన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రమాదం చేసి పరారవుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవి ఆధారంగానే దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు బడా బాబుల పిల్లలే ఉండటంతో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు. ఈ ఘటనలకు పాల్పడుతున్న పుత్ర రత్నాల తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించి కౌన్సింగ్ ఇస్తున్నారు.