Hyderabad: చందు రాథోడ్‌ హత్యకేసులో నిందితులు అరెస్ట్

రెక్కి చేశారు.. కాల్పులు జరిపారు.. ఎస్కేప్ అయ్యారు.. ఖాకీలకు దొరికేదేలే అని కాలర్‌ ఎగరేశారు. బట్.. వాళ్ల లెక్క తప్పింది. పోలీసులు తీగలాగితే.. హంతకముఠా డొంక మొత్తం కదిలింది. రీసెంట్‌గా భాగ్యనగరంలో కాల్పుల వెనుక సుపారీ చిత్రం మొత్తాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఇంతకీ.. చందు హత్యకి దారితీసిన రీజన్స్ ఏంటి? పట్టుబడ్డ నిందితులు చెప్పిందేంటి?

Hyderabad: చందు రాథోడ్‌ హత్యకేసులో నిందితులు అరెస్ట్
Chandu Naik

Updated on: Jul 19, 2025 | 9:48 PM

హైదరాబాద్‌ మలక్‌పేటలో సంచలనం రేపిన కాల్పుల ఘటనలో పోలీసులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. చందు రాథోడ్‌ని చంపింది నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్‌గా గుర్తించారు. హత్యకు రాజేష్‌ సుపారీ ఇచ్చినట్టు తేల్చారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీ కెమెరాల పరిశీలన
కేతావత్ చందు రాథోడ్‌.. సీపీఐ నేత. జులై 15న మలక్‌పేట శాలివాహన నగర్‌ పార్క్‌లో వాకింగ్‌ చేస్తుండగా.. కొంతమంది స్విఫ్ట్‌ కారులో వచ్చి.. చందుపై కాల్పులు జరిపారు. చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడ్నుంచి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. గతంలో కొన్ని కేసుల వివరాల ఆధారంగా.. కాల్పులకి తెగబడింది నెల్లూరుకు చెందిన ముఠా హత్య చేసినట్టు ఐడెంటిఫై చేశారు. దొంతి రాజేష్‌, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞాన ప్రకాష్‌, లింగిబేడి రాంబాబు, కందుకూరి ప్రశాంత్‌లను అరెస్ట్ చేశామన్నారు డీసీసీ చైతన్య.
బిల్డర్ ఇచ్చిన డబ్బు చందుకి ఇవ్వని రాజేష్‌
కుంట్లూరులో గుడిసెలు వేసిన క్రమంలో రాజేష్‌, చందు బాధితుల నుంచి కొంత డబ్బు వసూలు చేశారు. ఆ విషయంలో ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. అలాగే చందు రాథోడ్ బామ్మర్దికి.. బిల్డర్ బాల్‌రెడ్డికి మధ్య జరిగిన గొడవలో బాల్‌రెడ్డిని రాజేష్‌ బెదిరించి 15లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బును చందుకి రాజేష్ ఇవ్వలేదు. అప్పటినుంచి ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది.
అలాగే తన భార్యతో చందుకి వివాహేతర సంబంధం ఉందని రాజేష్ అనుమానించాడు. ఆ విషయంలో పెద్దల మధ్య పంచాయితీ ఆపై రాజీ కూడా జరిగిపోయింది. వరుసగా ఒకదాని వెనుక మరొకటి మనసులో పెట్టుకున్న రాజేష్‌.. నెల్లూరు గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చి చందుని చంపించినట్టు విచారణలో గుర్తించామన్నారు పోలీసులు.
మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ సైదాబాద్ పీఎస్ ఎదుట సీపీఐ నేతల ఆందోళనకు దిగారు. చందుకి వివాహేతర సంబంధాన్ని అంటగడుతూ.. నిందితుల్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసత్య ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతల నిరసనతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..