BJP Vijaya Sankalpa Sabha: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ అట్టహాసంగా జరిగింది. చిరుజల్లుల కురుస్తున్నా పెద్ద సంఖ్యలో ప్రజలు, బీజేపీ శ్రేణులు సభకు తరలి వచ్చారు. జనసమీకరణ చూసిన ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ని భుజం తట్టి అభినందించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు, రాజకీయ విమర్శలు లేకుండా ఎంతో భిన్నంగా బీజేపీ విజయసంకల్ప సభ సాగింది. చివరగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ విమర్శలు, కేసీఆర్‌పై విమర్శలు లేకుండా ప్రసంగించారు. ఎంతో దూరం నుంచి ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం తథ్యమని కమలనాథులు ప్రకటించారు. 2019 ఎన్నికలతో పోల్చితే తెలంగాణలో బీజేపీపై ఆదరణ బాగా పెరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం తాను వచ్చానని మోదీ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, నిధులు, డబుల్ ఇంజిన్ సర్కారు వంటి మాటలకే ఆయన పరిమితమయ్యారు.
పరేడ్ గ్రౌండ్స్ వద్ద నిరసనకు దిగారు గులాబీ శ్రేణులు. సభ వెనుకభాగంలో మోదీ సభకు వ్యతిరేకంగా గులాబీ బెలూన్లను ఎగురవేశారు. ఐతే అక్కడే ఉన్న పోలీసులు..వాటిని కిందికి దించేశారు. మరోవైపు మోదీ సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో భారీగా బ్లాక్ బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపేందుకు కొందరు యత్నంచారు. అయితే ముందుగానే అలెర్టైన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.