
హైదరాబాద్, మే 12: ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు అంటే ఎంతో సందడిగా ఉండేది. పెళ్లి పనులు మొదలైన దగ్గరి నుంచి ఆ తర్వాత చేసే క్రతువులు, వివాహ వేడుక, భోజనాలు, అప్పగింతలు.. ఇలా ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఎంతో మర్యాదగా వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి..’ఫలానా తేదీన మా అబ్బాయి లేదా మా అమ్మాయి వివాహం ఉంది.. మీరు తప్పకుండా రావాలి’ అని ఎంతో మర్యాదగా ఆహ్వానించేవారు. దానికి బంధువులు కూడా అంతే గౌరవంగా ఫంక్షన్‌కి వచ్చి ఆశీర్వదించి, భోజనాలు చేసి వెళ్లేవారు. అలాంటిది పోనుపోను కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడు మానవ సంబంధాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పుడంతా ఇంటింటికీ వెళ్లి పెండ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానించే పరిస్థితులు తగ్గిపోయాయి. ఏ శుభకార్యానికి పిలవాలన్నా వాట్సాప్ ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఒక చిన్న పోస్ట్ పెట్టి లేదా లింక్ పంపించి మా ఇంట్లో పెళ్లికి ఇదే మీకు ఆహ్వానం అని చేతులు దులిపేసుకుంటున్నారు.
పోనీ.. ఇంతవరకు కూడా బాగానే ఉంది అనుకుందాం. కానీ, తాజాగా ఇంతకు మించి దిగజారి ప్రవర్తించిన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. హైదరాబాద్-పాతబస్తీలో జరిగిన ఓ ఫంక్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు వాట్సాప్ ద్వారా లీక్ అయింది. అదే తరహాలో డూప్లికేట్ ఇన్విటేషన్ తయారుచేసి సోషల్ మీడియాలో బంధువులు, మిత్రులకు షేర్ చేశారు ఆ ఇంటివాళ్లు. అంతా బాగానే ఉందనుకుని, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి. అమ్మాయి, అబ్బాయి తరఫు నుంచి కలిపి మొత్తం 2500 మందికి సరిపడా భోజనాలు సిద్ధం చేశారు. కానీ, ఊహించని విధంగా ఫంక్షన్‌కు 5 వేల మందికిపైగా అతిథులు రావడంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అనుకున్న దాని కన్నా ఎక్కువ సంఖ్యలో పెళ్లికి వచ్చినవాళ్లు అమ్మాయి తరఫు వాళ్లా? లేక అబ్బాయి తరఫు వాళ్లా? అని ఎవరూ అడగలేని పరిస్థితి. ఎలాగోలా జరగాల్సిన పెళ్లి అయితే శుభంగా పూర్తయింది. కానీ, విందు సమయంలో పెద్ద ఎత్తున జనాలు, ఖరీదైన కార్లలో వచ్చిన అతిథులు కనిపించడంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చేసేదిలేక గేటువద్ద నిలబడి వచ్చే వారు తమకు తెలిసినవారా? కాదా? అని పరిశీలించి మరీ పెళ్లి మండపంలోకి ఆహ్వానం పలకసాగారు. ఇంతలో నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఆ పెళ్లికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు మొదట ఆశ్చర్యపోయారు. తీరా ఆరా తీస్తే, ఆయన చూపించిన ఇన్విటేషన్, వాళ్లు ముద్రించిన అసలు ఇన్విటేషన్‌తో సరిపోలకపోవడంతో అసలు విషయం బయటపడింది.
ప్పటికే వందల మంది భోజనాలు కూడా చేసి వెళ్లిపోయారు. అపరిచితులు వచ్చి భోజనం చేసి వెళ్లిపోవడంతో దగ్గరి బంధువులకు ఏర్పాట్లలో లోటుపాట్లు ఎదురయ్యాయి. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు అదనంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటనతో హైదరాబాద్‌లో ప్రముఖులను, రాజకీయ నాయకులను లేదా స్నేహితులను ఫంక్షన్‌కి పిలవాలన్నా వంద సార్లు ఆలోచించాల్సిందే అంటూ పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అయితే.. ఎవరో కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉండవచ్చని ఇరువైపులా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పైగా ప్రముఖ వ్యక్తులను ఎవరైనా శుభకార్యాలకు పిలిస్తే వాళ్లతో పాటు పదుల సంఖ్యలో వారి అనుచరులు కూడా వస్తున్నారు. మరోవైపు స్నేహితులను పిలిస్తే వాళ్లు కూడా వారి వెంట మరో నలుగురిని వెంటేసుకుని వచ్చేస్తారు. ఏ రకంగా చూసినా పెళ్లికి ఆహ్వానించేవారికి ఇది తలనొప్పి వ్యవహారమే. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ కావడంతో.. “డబ్బున్నవాడు అయితే పరువు కాపాడుకుంటాడు, మరి సామాన్యుడైతే పరిస్థితి ఏంటి?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.