
ఫేక్ పాస్‌పోర్ట్ ముఠాపై తెలంగాణ పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సీఐడీ తాజాగా మరికొందరి కోసం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫేక్ పాస్‌పోర్ట్‌లు జారీ చేసిన ఇంటి దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. తెలంగాణలో ఫేక్ పాస్‌పోర్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఫేక్ పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు కొంతమంది అధికారులు. స్థానిక ఏజెంట్లతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపించినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. తమిళనాడుకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా ఈ ఫేక్ పాస్‌పోర్ట్ రాకెట్ బయటపడింది. స్థానిక ఏజెంట్ ఫేక్ పత్రాలు సృష్టించాడు. నకిలీ పత్రాల ద్వారా ఈజీగా ఫేక్ పాస్‌పోర్ట్‌లు పొందే విధంగా వ్యూహం రచించాడు. తమిళనాడు నుంచి వాళ్ళందరిని హైదరాబాద్‌కి పంపించి నకిలీ పత్రాలతోనే పాస్‌పోర్ట్ అప్లికేషన్ నింపేలా చేశాడు.
పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏజెంట్ల ఫోన్ నెంబర్లు పెట్టి కథ నడిపించాడు. పాస్‌పోర్ట్ దరఖాస్తు రాగానే ఎవరికైనా సరే పోలీస్ ఎంక్వయిరీ తప్పనిసరి. అయితే పోలీసులను మేనేజ్ చేయడంలో ఏజెంట్లు సక్సెస్ అయ్యారు. ఇంకేముంది నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నవారికి సైతం పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. అయితే ఇన్ని లోసుగులు ఉన్నా.. పాస్‌పోర్ట్ జారీ కావడంపై సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి పాస్‌పోర్ట్ జారీ కావాలంటే ఖచ్చితంగా ఒకే అడ్రస్ కలిగిన రెండు ఐడెంటిటీ ప్రూఫ్‌లు ఉండాలి. ఇది ఉన్నప్పటికీ కచ్చితంగా స్థానిక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం దగ్గరికి వెళ్లి సంబంధిత వ్యక్తి తన ఐరిస్‌ను తీసుకున్న తర్వాతనే పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రాసెస్ ముందుకు వెళుతుంది. అలాంటిది ఇక్కడ ఫేక్ పత్రాలతో పాస్‌పోర్ట్ అప్లై చేసినా సరే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరికి పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. దీంతో పాస్‌పోర్ట్ కార్యాలయ సిబ్బంది పాత్ర కూడా దాగి ఉన్నట్టు సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు సీఐడీ పోలీసుల విచారణలో సుమారు 92 మంది నకిలీ పత్రాలతో ఫేక్ పాస్‌పోర్ట్‌లు పొందినట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువ శాతం హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆరు జిల్లాలలో పాస్‌పోర్ట్ బ్రోకర్లతో పాటు తమిళనాడుకు చెందిన మెయిన్ బ్రోకర్లు అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు నిర్ధారించారు. అయితే వీరు కొంతమంది విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించినట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంతమందికి వీసాలు సైతం మంజూరు అయినట్టు గుర్తించారు. యూరోపియన్ దేశాలకు పాస్‌పోర్ట్, వీసాలు అయ్యాయి. అయితే నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొందినవారి అసలు బ్యాగ్రౌండ్ ఏంటని సీఐడీ పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందా లేదంటే ఉద్యోగాల పేరుతో ఇతర దేశాలకు ఏజెంట్లే వీరిని పంపారా అనే కోణంలో సీఐడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.