మనకును అలవాట్లు, మనం చేసే పనులు.. మంచివైతే మనం ముందుకు వెళ్తాం.. చెడ్డవైతే పాతాళానికి పడిపోతాం. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన అక్షర సత్యం ఇది. ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున గంజాయి సేవిస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తున్నా.. పోలీసులు.. నిత్యం యాక్షన్ తీసుకుంటున్నా.. మహమ్మారి గంజాయికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అక్రమ డబ్బుకు మరిగిన కొందరు దుర్మార్గులు.. ఈ మత్తును సరఫరా చేస్తూ యువతను చిత్తు చేస్తున్నారు. బంగారం లాంటి వాళ్ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన కొందరు.. దాన్ని నుంచి బయటకు రాలేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు గంజాయి అలవాటు మానలేక ప్రాణం తీసుకున్నాడు.
విజయకుమార్ అనే యువకుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ వైపు నుంచి సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఇతర డాక్యూమెంట్స్ ఆధారంగా విజయకుమార్‌గా గుర్తించారు. వెంటనే అతడు చదువుతున్న కళాశాల యాజమాన్యానికి, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు.
విజయ్‌కుమార్ ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో డిప్లమో చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత అది వ్యసనంగా మారింది. డిప్లమో అనంతరం ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడ కూడా గంజాయి అలవాటును కొనసాగించినట్లు తండ్రి శ్రీనివాస్ తెలిపారు. బీటెక్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మాన్సించి.. చర్లపల్లిలో చికెన్ సెంటర్ పెట్టించారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ డిప్రెషన్ బారిన పడ్డాడు. గంజాయిని వీడలేకపోయాడు. దీంతో అతని పేరెంట్స్ సికింద్రాబాద్‌లోని డీ ఎడిక్షన్ సెంటర్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
ఈ క్రమంలో తాను మళ్లీ చదువుకుంటానని చెప్పడంతో.. నార్లపల్లిలోని కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చేర్పించారు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. కొద్ది నెలలుగా తాను మానసిక సంఘర్షనకు గురవుతున్నానని.. ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండటంతో తల్లిదండ్రులు సముదాయించి.. ధైర్యం చెబుతూ వస్తున్నారు. కానీ అతను తీవ్ర కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌కుమార్ ఏదో సరదాకు అని గంజాయి తాగితే.. ఆ తర్వాతి కాలంలో అది వ్యసనంగా మారి జీవితాన్ని బలి చేసుకుంది. యూత్.. బీ కేర్‌ఫుల్.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..