అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి నిర్మూలనకు మూసీ నది అభివృద్ధి సంస్థ(ఎమ్ఆర్డీసీ) చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు వారు డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల ద్వారా మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమనిర్మాణాలను గుర్తించి.. వాటికి సంబంధించిన ఫొటోలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు పంపనున్నామని వారు తెలిపారు. ఆ తరువాత రెవెన్యూ శాఖ సహకారంతో వాటిని తొలగించనున్నామని ఎమ్ఆర్డీసీ అధికారులు పేర్కొన్నారు.
అయితే 2016 రెవెన్యూ శాఖ జరిపిన ఓ సర్వేలో మూసీ నది పరివాహక మండలాల్లో 8,529 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. వీటిపై సమగ్ర వివరాలను సేకరించిన అధికారులు అప్పట్లో కొన్నింటిని తొలగించారు. అయినా ఇప్పటికీ కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాల నిర్మాణం జరుగుతుందని తెలిపిన అధికారులు.. వాటిని నిర్మూలించేందుకు తాము చర్యలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. కాగా వీటితో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాని ఎమ్ఆర్డీసీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.