
Diabetes Effects: షుగర్ ఉన్న చాలామందికి అసలు తెలియకుండానే కాళ్లలో ప్రమాదం మొదలవుతోంది. నొప్పి లేదు.. మంట లేదు.. కానీ లోపల నాడులు క్రమంగా పనిచేయడం మానేస్తున్నాయి. ఇదే డయాబెటిక్ న్యూరోపతి. ఈ సమస్యను గుర్తించడంలో ఆలస్యం అయితే చిన్న గాయం కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. కొన్నిసార్లు అది కాళ్లు కోల్పోయే స్థాయికి తీసుకెళ్తోంది. షుగర్ ఎక్కువకాలంగా ఉన్నవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా పాదాల్లో స్పర్శ తగ్గిపోతుంది. కాలికి గాయం అయినా నొప్పి తెలియదు. రక్త ప్రసరణ సరిగా లేక గాయం మానడానికి సమయం పడుతుంది. అదే సమయంలో ఇన్‌ఫెక్షన్ శరీరంలోకి చొచ్చుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. పరిస్థితి చేయి దాటితే ప్రాణాలు కాపాడేందుకు కాలును తొలగించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోంది.
ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉస్మానియా ఆసుపత్రి మధుమేహ బాధితులకు కీలక సహాయంగా నిలుస్తోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న ‘డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్’లో పాదాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు ఈ క్లినిక్‌కు వస్తుండగా, ఎక్కువ మంది 30 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారే. మహిళలకంటే పురుషులే అధికంగా చికిత్స పొందుతున్నారు. కాళ్లలో అల్సర్లు, పుండ్లు, మానని గాయాలతో బాధపడుతూ వచ్చే రోగులను ముందుగా స్క్రీనింగ్ చేసి, న్యూరోపతి ఉందా లేదా అన్నది వైద్యులు నిర్ధారిస్తున్నారు. పరిస్థితిని బట్టి గాయాలకు చికిత్సలు చేయడంతో పాటు, మళ్లీ గాయాలు కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను కూడా అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: OnePlus Shutting Down: ఇక భారతదేశంలో వన్‌ప్లస్ మొబైళ్లు కనుమరుగవుతాయా? ఇదిగో క్లారిటీ!
పేద రోగులకు ఈ సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయి. గత రెండేళ్లలో దాదాపు రెండు వేల మంది డయాబెటిక్ న్యూరోపతి రోగులకు చికిత్సలు అందించామని, వారిలో 200 మందికి ప్రత్యేక చెప్పులు పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు. షుగర్ ఉన్నవారు కాళ్లను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ పరిశీలించుకోవడం, చిన్న సమస్య కనిపించినా వెంటనే ఆసుపత్రిని సంప్రదించడం ద్వారా పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈ సేవలను టెలి కాల్ ద్వారా ముందే బుక్ చేసుకుని.. సమయం వృథా అవ్వకుండా చికిత్స పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Silver: సిల్వర్ మాయాజాలం.. 20 రోజుల్లోనే ధనవంతులను చేసిన వెండి!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి