
మోంథా తుఫానుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి నిన్న రాత్రి సుమారు 23:30 గంటలకు నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారింది. ఈ తుఫాన్ కి మోంధా అనే పేరు పెట్టడం జరిగింది. తదుపరి ఈ మోంథా తుఫాను వాయు దిశలో కదిలి ఈరోజు ఉదయం 05:30 గంటలకు నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుంది. ఈరోజు ఉదయం 08:30 గంటలకు ఈ మోంధా తుఫాను ఇంచుమించు అదే ప్రాంతంలో కొనసాగుతూ చెన్నైకి ఆగ్నేయంగా 520 కిలోమీటర్స్, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్స్ – విశాఖపట్నం కి దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
రాగల 24 గంటలలో ఈ మోంధా తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మరింత బలపడి రేపు 28 అక్టోబర్ 2025, ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. తదుపరి ఈ తీవ్ర తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇంచుమించు కాకినాడకు సమీపంలో రేపు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో ఈదురుగాలుల వేగం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర – ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు – ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర – ఈశాన్యం జిల్లాల్లో ఉరుములు మెరుపులు -గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..