పార్క్ చేసిన వాహనాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇటీవల కాలంలో పార్క్ చేసిన కార్లలో చిక్కుకుని పిల్లలు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. సైబరాబాద్ పోలీసులు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. వాహనం లాక్ చేసే ముందు లోపల ఎవరైనా ఉన్నారో లేదో తనిఖీ చేయాలి. పిల్లలను వాహనాల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వాహనాలు ఆటగా కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. చిన్నారుల ప్రాణరక్షణ మనందరి బాధ్యత.

Car Safety
ఇటీవల కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సైబరాబాద్ పోలీస్ వారు పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలం.
కొన్ని సూచనలు:
- వాహనాన్ని లాక్ చేయకముందు వాహనంలో ఎవరైనా ఉన్నారా అని పూర్తిగా తనిఖీ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను గమనించి పరిశీలించుకోవాలి.
- వాహనంలో లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్ళకూడదు.
- వాహన తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం గమనించగలరు.
- వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలి. వాహనాల్లో ఒంటరిగా ప్రవేశించరాదని వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.
- వాహనాన్ని ఎప్పుడైనా లాక్ చేయేముందు మళ్లీ తనిఖీ చేయండి—పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఏమైనా లోపల ఉన్నాయో ఒకసారి పరిశీలించండి.
- వాహనం ఎక్కడ పార్క్ చేసినా (ఇంటి వద్ద అయినా సరే) తప్పకుండా లాక్ చేయాలి. తాళాలను పిల్లలకు అందుబాటులో ఉండకుండా భద్రపరచాలి.
- “రియర్ సీట్ రిమైండర్”, “చైల్డ్ డిటెక్షన్ అలర్ట్” వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో అమర్చండి.
- వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించరాదు—వాహనంలో ఎవరైనా ఉంటే గుర్తించలేని ప్రమాదం ఉంది.
- వాహనం వాడకంలో లేకపోయినప్పటికీ డోర్లు, విండోలను పూర్తిగా మూసి లాక్ చేయాలి.
- పిల్లలు కనిపించకుండా పోతే, వాహనాల్లో, సమీప వాహనాల్లో పరిశీలించాలి.
- వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు పార్క్ చేసిన వాహనాల చుట్టూ పిల్లలు ఆడుకుంటే తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. చిన్నారుల భద్రత మన చేతుల్లోనే ఉంది.
ప్రజా ప్రయోజనార్థం విడుదల చేయనైనది – సైబరాబాద్ పోలీస్
