Cyber Crime In Hyderabad: హైదరాబాద్ విశ్వనగరమే కాదు.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా కూడా. ఆదమరిచామా.. అంతేసంగతులు. చేతిలో మొబైల్ ఉందికదా అని.. వచ్చిన లింకులన్నీ క్లిక్ చేశారా ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అప్రమత్తంగా లేకుంటే అందినకాడికి దోచుకునేందుకు సైబర్ కేటుగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కొత్తతరహాలో మోసం చేసేందుకు కాచుక్కూర్చుంటారు. హైదరాబాద్‌లో ఓ యువతి అలాంటి మోసానికే తెరదీసింది. యువకులే టార్గెట్‌గా ఇన్‌స్టాగ్రాంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. హొయలొలుకుతూ మాయమాటలు చెప్పింది. ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాప్‌లో అమ్మాయిలను ఎరగా చూపింది. న్యూడ్ వీడియోలు పంపి బ్లాక్‌మెయిల్‌కు తెగబడింది. అడిగినంత డబ్బు ఇస్తే సరే.. లేదంటే న్యూడ్ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. వీడియో డిలిట్ చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనంటూ యువకులకు చుక్కలు చూపింది. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. వందల సంఖ్యలో యువకులను బెదిరించి లక్షల్లో డబ్బు గుంజింది.
అయితే, ఈ వేధింపులను భరించలేని ఓ బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కిలాడీ యువతి బండారం బయటపడింది. తన నుంచి వేల రూపాయలు వసూలు చేసిందన్న యువకుడి కంప్లైంట్‌తో గచ్చిబౌలి పోలీసులు అలెర్ట్ అయ్యారు. యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి చేతిలో మోసపోయినవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. పరువుపోతుందన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు భయపడొద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టులపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అప్రమత్తతతోనే ఆన్‌లైన్ మోసాల నుంచి బయటపడగలమని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం