
హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.. విధి నిర్వహణలో ఉండగానే ఓ కానిస్టేబుల్ కుప్పకూలి మరణించారు.. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న బాలనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి.. తనిఖీలు ప్రారంభించారు.. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలారు.. వెంటనే గమనించినటువంటి తోటి సిబ్బంది హుటాహుటిన కానిస్టేబుల్ ను హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే.. వెంటనే పోలీసు సిబ్బంది ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.. అప్పటివరకు తమతో ఉన్న కానిస్టేబుల్ హఠాత్తుగా కిందపడి మరణించడంతో ఎస్ఓటి బాలనగర్ పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏపీ మచిలీపట్నానికి చెందినటువంటి కానిస్టేబుల్ ప్రవీణ్.. హైదరాబాద్ లోని చింతల్‌లో నివసిస్తున్నారు. 2012 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ గత 13 సంవత్సరాలుగా కానిస్టేబుల్‌గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య, ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు.
శనివారం సాయంత్రం ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారం తెలుసుకొని బాలానగర్ ఎస్ఓటి దిల్‌కుష్ నగర్ ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న సమయంలో ప్రవీణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించినటువంటి తోటి సిబ్బంది వెంటనే ప్రవీణ్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పుడూ పనిలో చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తి.. అప్పటివరకు తమతో ఉన్న వ్యక్తి.. ఇక లేరన్న విషయాన్ని పోలీసు సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.. ప్రవీణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..