పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..అందుబాటులో కార్పొరేట్ వైద్యం !

హైదరాబాద్ నగర ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే దిశగా సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ముందడుగు వేసింది. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ భారీ ఆసుపత్రిలో జూన్ 2న అధికారిక ప్రారంభానికి ముందు నుంచే ట్రయల్ రన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి బాహ్య రోగుల (OP) విభాగం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..అందుబాటులో కార్పొరేట్ వైద్యం !
Tims Sanathnagar Hospital

Edited By:

Updated on: May 02, 2026 | 4:56 PM

హైదరాబాద్ నగరానికి ఆరోగ్య రంగంలో ఒక పెద్ద ముందడుగు పడింది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జూన్ 2న అధికారిక ప్రారంభానికి ముందు నుంచే ఆసుపత్రి పనితీరును పరీక్షించేందుకు ట్రయల్ రన్ ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఓపీ సేవలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాగా, మొదటి రోజే 22 మంది రోగులకు వైద్యులు కన్సల్టేషన్ నిర్వహించారు. వారికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందించారు. బోరబండకు చెందిన మణెమ్మ ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన తొలి రోగిగా నమోదు అయ్యారు.

ఎర్రగడ్డలోని విస్తారమైన 22.6 ఎకరాల ప్రాంగణంలో, సుమారు 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,100 కోట్లతో ఈ భారీ ఆసుపత్రిని నిర్మించారు. మొత్తం ఐదు బ్లాకులుగా విభజించిన ఈ సముదాయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని వసతులు ఉన్నాయి. బ్లాక్-ఏలో అత్యవసర విభాగాలు, 16 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయగా, బ్లాక్-బిలో క్యాథ్ ల్యాబ్, కార్డియాక్ థియేటర్లు ఉన్నాయి. బ్లాక్-సిలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, వీఐపీ సూట్లు ఏర్పాటు చేశారు. రోగుల వెంట వచ్చిన వారికోసం 200 పడకల ధర్మశాల నిర్మించడం ఈ ఆసుపత్రి మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తోంది.

అత్యాధునిక వైద్య పరికరాలతో కూడా ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128 స్లైస్ సీటీ స్కాన్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1000 పడకల్లో 300 ఐసీయూ, 500 జనరల్ వార్డు, 200 పెయిడ్ వార్డు పడకలు ఉన్నాయి. ఆసుపత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే దాదాపు 3 వేల మంది వైద్య, వైద్యేతర సిబ్బంది సేవలందించనున్నారు. ప్రస్తుతం ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చిన తాత్కాలిక సిబ్బందితో ట్రయల్ రన్ కొనసాగుతోంది. మొదటి దశలోనే 22 రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. పచ్చని వాతావరణం, విశాలమైన పార్కింగ్, 30 లిఫ్టులతో రూపొందించిన ఈ భవనం సాధారణ ఆసుపత్రి కాదు.. ప్రజల ఆరోగ్యానికి అంకితమైన ఆధునిక వైద్య కేంద్రంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక నెలపాటు ఓపీ సేవలను పరిశీలించిన తరువాత, అన్ని విభాగాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసి జూన్ రెండో వారానికి ఆసుపత్రిని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us