సదర్.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్. నగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఒకటి. అందుకే హైదరాబాద్ ప్రజలకు సదర్ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. డప్పు చప్పుళ్లు.. యువత నృత్యాల మధ్య అందంగా ముస్తాబు చేసిన దున్నరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రతీ ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యాదవులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జరిగే సదర్ ఉత్సవాల్లో హర్యానాకు చెందిన శ్రీకృష్ణ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. హర్యానాతో పాటు పంజాబ్ నుంచి దున్నరాజులను నగరానికి తెప్పించారు. ఈసారి ఉత్సవాల్లో మొత్తం 9 దున్నరాజులు సందడి చేయన్నాయి. సదరు ఉత్సవాల విషయానికొస్తే.. మొదటిసారి1946 నారాయణగూడలో సదరు ప్రారంభమైంది. 2009 నుంచి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది ఉత్సవాల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కింగ్ నిలిస్తే.. ఈసారి శ్రీకృష్ణ సందడి చేయనుంది.
కాగా ముషీరాబాద్‌కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్, చప్పల్‌బజార్‌కు చెందిన లడ్డు యాదవ్, ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్‌తో పాటు మరికొందరు సదర్‌లో పోటీ పడేందుకు దున్నలను సిద్ధం చేస్తున్నారు. ఎడ్ల హరిబాబు యాదవ్ ఇప్పటికే హర్యానాకు చెందిన దున్నరాజుతో పాటు తలసాని అర్జున్, శ్రీకృష్ణ వంటి దున్నలను తీసుకొచ్చారు. హర్యానాలో పలు చాంపియన్ షిప్‌లను గెలుచుకున్న దున్నను నగరానికి తరలించిన ఆయన దాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయిస్తూ పోషకాహారం అందిస్తున్నారు. హర్యానాకు చెందిన శ్రీకృష్ణ దున్న ఈ సారి సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హర్యానా లోని ఇసాన్ జిల్లా జుగ్లాండ్ గ్రామానికి చెందిన శ్రీకృష్ణను సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్ వాహనంలో ముషీరాబాద్‌కు తీసుకువచ్చారు. ఐదు ఏళ్ల వయస్సు, 1800 కిలోల బరువు, ఏడు అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు దీని సొంతం. శ్రీకృష్ణ దున్నకు ప్రతి రోజు రూ. 5 వేల విలువ చేసే ఆహారం ఉదయం, సాయంత్రం అందిస్తారు. ఉదయం సాయంత్రం 10 లీటర్ల పాలు, డ్రైఫ్రూట్స్, ఖాజు, పిస్తా, ఆపిల్ పండ్లు, నెయ్యి, బెల్లం తదితర వాటిని ఆహారంగా పెడతారు. ప్రతి రెండు లీటర్ల ఆవనూనెతో మసాజ్ చేయడంతో పాటు షాంపుతో స్నానం, దీని ఆలనా పాలన చూసేందుకు ఇద్దరు కార్మికులు ఉన్నారు. పడుకోవడానికి ప్రత్యేక ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు.