ఆన్‌లైన్ అప్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. పరువు తీసి మనిషి ప్రాణం తీసుకునేలా చేస్తున్నాయి. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో మరో ఇద్దరు సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడడం విషాదాన్ని నింపింది. కాసులిచ్చే లోన్ యాప్‌లు కాటికి పంపే మృత్యు పాశాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇంతలోనే ఓ ప్రముఖ కంపెనీ నుంచి అతను EMI ద్వారా రెండు ఫోన్లను కొనుగోలు చేశాడు. చివరి EMI రూ. 4 వేలు కట్టాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో ఇబ్బంది పడడంతో.. సదరు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది నిజాముద్దీన్ ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించారు. అవమానం భరించలేని నిజాముద్దీన్ చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాడు. తన చావుకు ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
అప్పుల బాధ భరించలేక ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్..
మలక్‌పేటలోనూ మరో ఘోరం జరిగిపోయింది. ఏకంగా అప్పుల భారం భరించలేని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలక్‌పేట్‌కు చెందిన అబ్దుల్ నవీద్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అబ్దుల్ విపరీతంగా అప్పులు చేశాడు. అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. కుటుంబ పోషణ కూడా భారంగా మారిపోయింది. దీనికి తన చావు ఒక్కటే పరిష్కారంగా భావించిన అబ్దుల్.. జల్పల్లి చెరువులో దూకేశాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
రికవరీ ఏజెంట్ల బరితెగింపు అమాయకుల్ని బలితీసుకుంటోంది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు అప్పుల బాధతో చనిపోవడం నగరంలో కలకలం రేపుతోంది. అప్పే పెను ముప్పయి ప్రాణాల్ని హరిస్తుండడం కంటతడి పెట్టిస్తోంది. తాజాగా ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తలకు..