Asaduddin Owaisi onRahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ వచ్చి రాహుల్ తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినంలో భాగంగా ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రసంగించారు. టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ సభ్యులకు కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మతకలహాలన్నీ కాంగ్రెస్ వల్లే జరిగాయని.. బాబ్రీ మసీదు ఘటన కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. బాబ్రీ మసీదును పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో కూల్చివేశారని, దాన్ని తిరిగి నిర్మించలేదని.. కానీ తెలంగాణ సచివాలయంలో కూలిపోయిన మసీదును కేసీఆర్ కట్టించారంటూ గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ముస్లింలను అవమాన పరుస్తున్నారని.. పదేపదే దాడులు జరుగుతున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బీజేపీని ఓడించాలన్న అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పరిపాలన నడుస్తుందోని ఎలాంటి మతకలహాలకు చోటు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ప్రశంసించారు.
ఒకేరోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగ రావడంతో.. మత పెద్దలమంతా చర్చించి మిలాద్ ఉన్ నబీ వేడుక తేదీని మార్చుకున్నామన్నారు. యువత మద్యం, గంజాయ్, డ్రగ్స్ లాంటి వాటికి బానిస కాకుండా రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచించాలని.. దేశానికి ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భార్యలపై భర్తలు.. భర్తలపై భార్యలు దాడులు చేసుకోవడం, హింస లాంటి వాటికి దూరంగా ఉండాలంటూ హితవు పలికారు.
అయితే, రాహుల్‌ను సడన్‌గా అసదుద్దీన్ టార్గెట్ చేయడానికి ఇటీవల తుక్కుగూడ సభే కారణంగా కనిపిస్తోంది. MIM, BRS రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు BJPకి సపోర్ట్ చేస్తాయని రాహుల్ చేసిన విమర్శలకు కౌంటర్‌గానే అసదుద్దీన్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ రాహుల్‌కి సవాల్ విసిరారని భావిస్తున్నారు. మరోవైపు అసద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పై అసద్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్. అసద్ ఇంట్లో పులిలా ఉంటారని, దమ్ముంటే వయనాడ్ వెళ్లి రాహుల్‌పై పోటీ చెయ్యాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..