Illegal Speed Breakers: మొదటి సారిగా ఓ ఆర్మీ స్కూల్‌కి జరిమానా విధించారు. అనుమతి లేకుండా స్పీడ్ బ్రేకర్లు వేసినందుకు పాఠశాల యాజమన్యానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. మల్కాజ్‌గిరి జిహెచ్‌ఎంసి సర్కిల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ను ఉటంకిస్తూ ఈ నోటీసు జారీ చేయబడింది. ఆర్కెపురం ప్రధాన రహదారిని అనుమతులు లేకుండా తవ్వి స్పీడ్ బ్రేకర్లు వేసినందుకు ఫైన్ వేసారు. పాఠశాల ప్రిన్సిపాల్ పేరు మీద ఈ నోటీసు జారీ చేశారు.
ఈ నోటీసులో వివరాలు ఇలా ఉన్నాయి.. కొవిడ్ -19 పాండమిక్ లాక్డౌన్ సమయంలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సిఆర్ఎంపి) లో భాగంగా 10 కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించాం. అధికారులు, నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉండటం చూసి ఆర్మీ పాఠశాల అధికారులు రహదారిని దెబ్బతీశారు. అనుమతులు లేకుండా ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు నిర్మించారు. ఇది చట్ట విరుద్దమైన పని అని జిహెచ్‌ఎంసి సూపరింటెండెంట్ అనిల్ రాజ్ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డు దెబ్బతిన్నందుకు 16.5 సెంటేజ్ చార్జీలు, 18 శాతం జీఎస్టీ చార్జీలు మొత్తం కలిపి 3 లక్షల వరకు చెల్లించాలని జరిమానా విధించింది. ఈ డబ్బులతో దెబ్బతిన్న రహదారికి మరమ్మత్తులు చేపట్టి సరిచేయాలని వివరించారు.