రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది.. తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది.. అప్రమత్తమై వెంటనే పరుగులు తీశారు.. ఏంటోనని చూడగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.. తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.. రంగారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బాలకృష్ణ కొంతకాలంగా రంగారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు..
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కలెక్టరేట్‌లో విధుల్లో ఉండగానే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలకృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలకృష్ణ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..