
ఓ వైపు చలి.. మరో వైపు అల్పపీడనంతో వర్షాలు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. మలక్కా జలసంధి – దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది నవంబర్ 24, 2025న పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం – దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా మరింత కదులుతూ, తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు.. చలి తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది.
అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..