
హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 9 హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. రేయి–పగలు తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు, నగరంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ హత్యలు నడిరోడ్డుపైనే జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ హత్యలలో ఎక్కువ శాతం ప్రతీకార దాడులే కావడం గమనార్హం. పాత కక్షలు, వ్యక్తిగత విరోధాలు, కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, పరువు హత్యలు వంటి కారణాలతో నిందితులు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల్లో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కత్తులు, తుపాకులు వంటి ఆయుధాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ 9 హత్యల కేసుల్లో మొత్తం 32 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 1న ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో మగు సింగ్ (58) హత్య జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో ముగ్గురు నిందితులు అతడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 4న రెయిన్ బజార్‌లో జునైద్ (35) హత్య జరిగింది. ప్రతీకార చర్యలో భాగంగా యాకుత్‌పురా వద్ద జునైద్‌పై దాడి చేసి, ఆరుగురు నిందితులు హత్య చేశారు. డిసెంబర్ 7న చంద్రన్నగుట్టలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు అజ్మత్‌ను అతని సవతి తండ్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 9న జవహర్ నగర్‌లో రియాల్టర్ వెంకటరత్నం (57)ను నడిరోడ్డుపైనే కత్తులు, తుపాకులతో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 10న అమీన్పూర్‌లో పరువు హత్య ఘటన కలకలం రేపింది. శ్రవణ్, జ్యోతిని హత్య చేసిన కేసులో యువతి కుటుంబ సభ్యులే నిందితులుగా తేలగా, ముగ్గురిని అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు కమాటిపురలో అరవింద్ బోస్లే (30) హత్య జరిగింది. వివాహేతర సంబంధమే కారణంగా ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 13న రాజేంద్రనగర్‌లో అమీర్ (32) అనే యువకుడిని పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారు. ఈ కేసులో పహాడిశరీఫ్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 14న టోలిచౌకిలో ఇర్ఫాన్ (24) అనే ఆటో డ్రైవర్‌ను వివాహేతర సంబంధం ఆరోపణలతో ముగ్గురు నిందితులు హత్య చేశారు. తాజాగా డిసెంబర్ 17న బాలాపూర్‌లో మరో హత్య జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ముర్షిద్ (19) అనే యువకుడిని అబ్దుల్లా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వరుస హత్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు గస్తీ పెంచి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.