
హైదరాబాద్, జనవరి 22: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రోడ్డు భద్రతను పెంపొందించడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’పై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహించారు. ఈ తనిఖీలు డిసెంబర్ 24, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు జరిగాయి.ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు, కోర్టు విచారణల అనంతరం ఈ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 270 మందిని దోషులుగా నిర్ధారిస్తూ హైదరాబాద్‌లోని పలు న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.
దోషులుగా తేలిన వారికి జైలు శిక్ష విధించి, జైలుకు తరలించారు. అంతేకాకుండా ఈ వ్యక్తులు పనిచేస్తున్న ప్రభుత్వ/ ప్రైవేట్ కార్యాలయాలకు లేదా వారు చదువుతున్న విద్యాసంస్థలకు లేఖలు రాస్తూ, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరం. ఇది ప్రజల భద్రతకు పెను ముప్పు కలిగిస్తుంది. ఇటువంటి ఉల్లంఘనలను హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం కఠినంగా పరిగణిస్తోంది. నిందితులకు ఎటువంటి మినహాయింపు లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజల ప్రాణాలను రక్షించడం, రోడ్డు క్రమశిక్షణను కాపాడటం కోసం ఈ ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయి. వాహనదారులందరూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నామని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.