అమానవీయ ఘటన.. నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం!

|

Jan 21, 2025 | 9:57 AM

వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరంలో కాపురం పెట్టగా కొన్నాళ్లకు భార్య గర్భం దాల్చింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న పతి దేవుడు ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో భార్యతో ఫుల్లుగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే కడుపుపై కూర్చుని పిండం బయటకు వచ్చేంత వరకు తొక్కి హతమార్చాడు..

అమానవీయ ఘటన.. నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం!
Husband Killed Wife
Follow us on

హైదరాబాద్‌, జనవరి 21: ఓ మృగాడు కట్టుకున్న భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. నిండు చూలాలైన భార్యపు కడుపుపై కూర్చుని నరయాతన పెట్టాడు. దీంతో గర్భంలోని పిండం కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఇంత దారుణానికి కారణం భార్యపై అతడికున్న అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై నిండు చూలాలైన భార్యను, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జనవరి 18న చోటుచేసుకుంది. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ జి అంజయ్య, ఎస్‌ఐ ఎన్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..

కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్‌ సత్యనారాయణ (21)కు కొన్నాళ్ల క్రితం కాప్రాకు చెందిన స్నేహ (21) అనే యువతితో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రమేగా మారడంతో 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో సచిన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరి జంటకు 2023లో ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్‌ చేస్తున్న పని మానేసి జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొడుకును పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేశాడు. అంతేకాకుండా రూ.లక్షకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. భర్త దుర్మార్గం గ్రహించిన స్నేహ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించి, సత్యనారాయణను మందలించి వెళ్లారు. కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ బాబు కూడా మృతి చెందాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు ఎడమొఖం పెడముఖంగా ఉండసాగారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కలిసిపోయిన ఈ జంట కాప్రాలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టి గత ఏడాది డిసెంబరు 11 నుంచి కలిసుండ సాగారు. అయితే అప్పటికే 7 నెలల గర్భవతైన భార్య స్నేహపై సత్యనారాయణకు అనుమానం మొదలైంది. గర్భం ఎలా దాల్చావంటూ నిత్యం వేదించేవాడు. ఈ క్రమంలోనే జనవరి 15న రాత్రి భార్యకు ఫూటుగా మద్యం తాగించాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చుని, దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. కడుపు మీద కూర్చుని తొక్కడంతో కడుపులో పిండం మృతి చెంది బయటకు వచ్చింది. ఇంత దారుణానికి పాల్పడిన సత్యనారాయణ భార్య మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

ఇవి కూడా చదవండి

వంటగదిలోని సిలిండర్‌ను తీసుకొచ్చి గ్యాస్‌ లీకయ్యేలా పైపును బయటకు తీసి అక్కడి నుంచి పారిపోయాడు. సిలిండర్‌లో గ్యాస్‌ అయిపోయిందేగానీ.. అది పేలలేదు. దీంతో అతగాడి పన్నాగం బెడిసికొట్టింది. జనవరి 18న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని కాచిగూడలో అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా సత్యనారాయణ నేరం అంగీకరించాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.