AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వైద్యుల మరో సాహసం.. 5వ అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జన్మ

భవనం 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 13 ఏళ్ల బాలుడికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అద్భుత వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. తీవ్ర బృహద్ధమని గాయం, మెదడు గాయం, బహుళ అవయవాల వైఫల్యంతో పోరాడిన బాలుడిని వైద్యులు సమిష్టి కృషితో కాపాడగలిగారు. వారాల పాటు వెంటిలేటర్, డయాలసిస్, ప్రత్యేక ఐసీయూ చికిత్సల అనంతరం బాలుడు కోమా నుంచి కోలుకుని పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి స్వయంగా గీసిన కళాఖండాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలియజేయడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది..

హైదరాబాద్ వైద్యుల మరో సాహసం.. 5వ అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జన్మ
13 Year Old Defies Death After Miraculous Recovery
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 7:16 PM

Share

భవనం 5వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారిపడి, బ్రతుకుతాడనే ఆశల్లేని స్థితికి చేరిన ఒక 13 ఏళ్ల బాలుడికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అద్భుత చికిత్సతో పునర్జన్మ ప్రసాదించారు. తీవ్రమైన బృహద్ధమని గాయం, మెదడు గాయం, పలు అవయవాల వైఫల్యంతో పోరాడిన ఆ బాలుడు వైద్యుల సమిష్టి కృషితో మృత్యుంజయుడిగా నిలిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని మొదట నిజాంపేట సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికంగా వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కోసం కూకట్‌పల్లిలోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే బాలుడి శరీరం నుండి తీవ్రంగా రక్తం కారిపోయి.. బి.పి. పడిపోయి షాక్‌లోకి వెళ్ళిపోయాడు. పీడియాట్రిక్ ఐసియు వైద్య బృందం వెంటనే స్పందించి, సెలైన్ మరియు రక్తాన్ని ఎక్కిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరింత మెరుగైన ప్రపంచస్థాయి వైద్య సహాయం కోసం బాలుడిని బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తరలించారు.వైద్యులకు సవాల్‌గా మారిన బహుళ అవయవాల వైఫల్యం ఈ కేసు సాధారణమైనది కాదని, పిల్లలలో అత్యంత అరుదుగా ఒకేసారి కనిపించే తీవ్రమైన ప్రాణాంతక గాయాల కలయిక అని వైద్యులు తెలిపారు.

గుండె నుండి రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి తీవ్ర గాయమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇలాంటి గాయాలైన వారిలో 80-90% మంది ఆసుపత్రికి వచ్చేలోపే, మిగిలిన వారిలో 50% మంది మొదటి 24 గంటల్లోనే మరణిస్తారు. మెదడు, తలకు తీవ్ర గాయం, రెండు ఊపిరితిత్తులు మరియు క్లోమగ్రంథి గాయం, మూత్రపిండాల వైఫల్యం,కుడి తొడ ఎముక విరగడం ఈ ప్రమాదం లో జరిగాయి. బాలుడు హాస్పిటల్ కు వచ్చినప్పుడు ప్రధాన అవయవ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంది. మేము కేవలం ఒక గాయానికి చికిత్స చేయడంపై కాకుండా, ప్రతి అవయవం తిరిగి పనిచేసేలా చూడటంపై దృష్టి పెట్టాము. జీర్ణాశయాంతర రక్తస్రావం నుండి సెప్టిక్ షాక్ వరకు, సుదీర్ఘకాలం మెకానికల్ వెంటిలేషన్, డయాలసిస్ అవసరమయ్యాయి. మా ఐసీయూ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నిపుణులు రేయింబవళ్లు అవిశ్రాంతంగా చేసిన కృషే ఆ బిడ్డను కాపాడిందనీ డాక్టర్ అనుపమ తెలిపారు.

రంగంలోకి దిగిన నిపుణుల సమిష్టి బృందం బాలుడిని కాపాడటానికి ఒకేసారి పలు విభాగాల నిపుణులు రంగంలోకి దిగారు. కార్డియాలజీ, ఇంటెన్సివ్ కేర్, సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లతో కూడిన భారీ వైద్య బృందం సమిష్టిగా శ్రమించింది. ఈ కేసులో థొరాసిక్ అయోర్టిక్ గాయం అత్యంత క్లిష్టమైనది. కొద్దిపాటి ఆలస్యమైనా ప్రాణాలు పోయేవి. మేము వెంటనే ఎండోవాస్కులర్ స్టెంట్ ప్రక్రియ ద్వారా దెబ్బతిన్న రక్తనాళాన్ని సవరించాము. దీనివల్ల ఇంటెన్సివ్ కేర్ బృందం మిగతా గాయాలను నయం చేయడంపై దృష్టి పెట్టగలిగింది అని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రావు తెలిపారు.

అధునాతన న్యూరో-ఇంటెన్సివ్ కేర్ పర్యవేక్షణలో చికిత్స పొందుతూ, హాస్పిటల్‌లో చేరిన రెండో వారంలో బాలుడు క్రమంగా కోమా నుండి కోలుకున్నాడు. వెంటిలేటర్ తొలగించిన తర్వాత బాలుడి మెదడు పనితీరును అంచనా వేయడం వైద్యులకు పెద్ద సవాలుగా నిలిచింది. ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని గాయాలను నయం చేస్తూ రాగా, బాలుడు అద్భుతంగా కోలుకున్నాడు. పూర్తి ఆరోగ్యంతో 5 వారాల తర్వాత ఆ బాలుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. విరిగిన తొడ ఎముక నయం కావడానికి కొంతకాలం బెడ్ రెస్ట్ సూచించారు. కాగా, డిశ్చార్జ్ అయిన కొన్ని వారాల తర్వాత ఆ బాలుడు ఒక నవ్వుతున్న యువ కళాకారుడిగా మారి తిరిగి హాస్పిటల్‌కు వచ్చాడు. తన ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతగా, తను స్వయంగా గీసిన ఒక అద్భుతమైన కళాకృతిని ప్రశంసా చిహ్నంగా బహుకరించి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. రెయిన్‌బో హాస్పిటల్ వైద్యుల అంకితభావానికి, సమిష్టి కృషికి ఈ ఘటనే నిదర్శనం.

Follow Us