
బ్యాచిలర్లు, ఫ్యామిలీలు, ఏకాంతం కోరుకునే ప్రేమ జంటలకు గోవా ఓ ఎంజాయ్‌మెంట్ స్పాట్. బోలెడన్ని బీచ్‌లు, క్లబ్బులు, క్యాసినోలు.. ఎవరికి రేంజ్‌కి తగ్గట్లు వారికి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్. అక్కడి హోటల్‌లోనో, రిసార్ట్‌లోనో దిగాక మన వ్యక్తిగత గోప్యత భద్రమేనా అంటే.. డౌటే. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్లక్రితం గోవాకు వెళ్లిన ఓ బాధితురాలికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లయ్యాక వీడియోలు బయటపెట్టాలా అంటూ బ్లాక్ మెయిలింగ్ మొదలైంది. టార్చర్ భరించలేక చివరికి ఆ బాధితురాలు పోలీసులు ఆశ్రయించాల్సి వచ్చింది.
హైదరాబాద్ బాధితురాలికే కాదు చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎప్పుడో రెండేళ్లక్రితం గోవాకు వెళ్లింది. తర్వాత ఆమెకు పెళ్లయింది. కొత్త జీవితం ప్రారంభించాక.. గోవా నుంచి ఈమధ్యే ఫోనొచ్చింది. గోవాలో అప్పట్లో ఆమె బస, ప్రయాణ ఏర్పాట్లు చూసినోడే బ్లాక్‌మెయిలర్ అవతారమెత్తాడు. 30లక్షల రూపాయలు ఇవ్వకపోతే సీక్రెట్ వీడియోలు భర్తకు పంపుతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిలింగ్‌కి దిగాడు. పెళ్లికాక ముందు సరదాగా వేసిన టూర్ ఇప్పుడామె సంసారంలో చిచ్చుపెట్టేలా ఉంది.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ తన పెళ్లికి ముందు..2023లో పరిచయమున్న వ్యక్తితో గోవాకు వెళ్లింది. ఆ టైంలో వారిద్దరి బస, ప్రయాణ ఏర్పాట్లతో పాటు మిగిలినవన్నీ యశ్వంత్ అనే వ్యక్తి అందించాడు. అతను గోవాలో హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్‌ల మెయింటెనెన్స్‌తో పాటు కోఆర్డినేషన్ చూసుకునేవాడు కావటంతో వారికి ఎలాంటి అనుమానం రాలేదు. ఈ మధ్య ఆ మహిళకు యశ్వంత్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. గోవాలో ఉన్న సమయంలో ఆ జంట ఏకాంతంగా ఉన్న ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించానని యశ్వంత్ బెదిరించాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బెదిరింపులకు దిగాడు.
గోవా టూర్ తర్వాత ఆ మహిళకు పెళ్లయింది. భర్తతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆ వీడియోలు బయటపడితే తన వైవాహిక జీవితం దెబ్బతింటుందని బాధితురాలు వేడుకున్నా యశ్వంత్ బెదిరింపులు కొనసాగించాడు. అతడి టార్చర్ పెరిగిపోవటంతో వేరే దారిలేక బాధిత మహిళ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గోవాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాలను, నిందితుడి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు.
గోవాకి ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లే జంటలు ప్రైవేట్ బస ఎంచుకునేటప్పుడు, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తపడకపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన చాటిచెబుతోంది. వేరే చోటికి వెళ్లినప్పుడు వ్యక్తిగత వీడియోలు, సమాచారం లీక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..