
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్ల విక్రయానికి పాల్పడుతున్న ముఠాపై కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ విజయాన్ని సాధించారు. తక్షణ కండరాల ఎదుగుదల పేరుతో యువత ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ.6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన సరఫరాదారులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
టాస్క్‌ఫోర్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు బట్టే శివ గతంలో జిమ్ యజమానిగా, ట్రైనర్‌గా పనిచేయగా ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు. యువతలో త్వరగా కండరాల పెరుగుదలపై ఉన్న ఆసక్తిని అవకాశంగా మార్చుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి నిర్వహిస్తున్న ఈ-కామర్స్ వేదిక ద్వారా టెర్మిన్ (నియాన్), మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ వంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ కూడా పంజాబ్‌కు చెందిన వ్యక్తి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంజెక్షన్లు, సప్లిమెంట్లను కొనుగోలు చేసి తన అనుచరుల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 440 టెర్మిన్ (నియాన్) వయల్స్, 336 మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వయల్స్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సొమాట్రోపిన్, డ్రోస్టానోలోన్ ప్రొపియోనేట్ ఇంజెక్షన్లు, అమినో యాసిడ్ ద్రావణాలు, వందల సంఖ్యలో సప్లిమెంట్ టాబ్లెట్లు ఉన్నాయి. వీటితో పాటు నిందితులు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన విక్రేతలతో పాటు వారి ద్వారా సరఫరా చేస్తున్న నలుగురు సబ్-విక్రేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘మెడ్‌హౌస్ ఫార్మా’ నిర్వహిస్తున్న ముదిద్ చౌహాన్, పంజాబ్‌కు చెందిన ‘షిప్ రాకెట్’ నిర్వహిస్తున్న రాజన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. త్వరగా బాడీ బిల్డింగ్ కోసం వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్ వినియోగించడం ప్రాణాంతకమని హెచ్చరించారు. నగరంలోని జిమ్ యజమానులు, ట్రైనర్లు, సభ్యుల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని, జిమ్‌లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత సోషల్ మీడియా ప్రచారాలను, తప్పుడు ఫిట్‌నెస్ సలహాలను నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.