Telangana: హైదరాబాద్‌లో సదర్ జోష్.. దున్నపోతుల సందడి నెక్స్ట్ లెవెల్..

గోలు-2, రోలెక్స్‌, బజరంగీ, బాద్‌షా, కోహినూర్‌.. ఇవి సినిమాల పేర్లు కావు. సదర్‌ సంబురాల్లో దుమ్ము రేపే దున్నరాజుల నామధేయాలు. అవును.. దున్నరాజుల సదర్‌ సంబురానికి భాగ్యనగరం సిద్ధమైంది. ఈ సారి హర్యానా నుంచి వచ్చిన గోలు-2 దున్నపోతు.. సదర్‌ సంబరానికే స్పెషల్‌ అట్రాక్షన్‌. సదర్‌ సంబరాల్లో దమ్ము చూపించి, దుమ్ము రేపే దున్నరాజుల విశేషాలు చూద్దాం.

Telangana: హైదరాబాద్‌లో సదర్ జోష్.. దున్నపోతుల సందడి నెక్స్ట్ లెవెల్..
Hyderabad Sadar Festival 2025

Updated on: Oct 22, 2025 | 7:25 AM

సదర్‌ పేరు వింటే.. హైదరాబాద్‌లో ఓ వైబ్రేషన్‌ వస్తుంది. ఆ వైబ్రేషన్‌లో మరింత జోష్‌ నింపేందుకు సదర్‌ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత భాగ్యనగరంలో యాదవులు నిర్వహించే సదర్ సంబురాలు..ఈ సారి నెక్ట్స్‌ లెవెల్లో జరగనున్నాయి. నగరంలో సైదాబాద్, నారాయణగూడ, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, షేక్‌పేట్‌ ఏరియాల్లో సదర్‌ సంబరం ధూంధాంగా జరుగుతుంది.

ముషీరాబాద్‌ సదర్‌ ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల హరిబాబు నేతృత్వంలో.. గోలు-2, రోలెక్స్, కోహినూర్‌, బజరంగీ లాంటి భారీ దున్నపోతులను హర్యానా నుంచి తీసుకొచ్చారు. ఇవి ముర్రా జాతికి చెందినవి. ఈ దున్న రాజులు ఒక్కొక్కటి 12 అడుగుల పొడవు ఉంటాయి. వీటికి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్‌తో పాటు పాలు, పళ్లు అందిస్తారు. ఇక ఆయిల్ మసాజ్ సపరేట్. ఈసారి సదర్‌లో గోలు-2 ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇక కాళీ దున్నరాజు..ఇది 31 వేల రూపాయల విలువ చేసే రాయల్ సెల్యూట్‌ ఫుల్‌ బాటిల్‌ని ఏక్‌దమ్మున లాగించేస్తుంది. దరువాలా మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఘనంగా సదర్‌ నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆల్ ఇండియా ఛాంపియన్ గుమాం కాళీ అనే 25 కోట్ల రూపాయల విలువ చేసే దున్నరాజును తీసుకొచ్చారు.

ఇక రంగారెడ్డి జిల్లా నార్సింగిలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీన్మార్ స్టెప్స్ వేశారు. హైదరాబాద్ పాతబస్తీ చంచల్ గూడ రోడ్‌లో యాదవ సంఘం ఏర్పాటు చేసిన సదర్ మేళాకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 200 పైగా దున్నపోతులు ఈ మేళాలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.