
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు హైజీన్ రేటింగ్స్ ఇవ్వాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) నిర్ణయించింది. నగరంలోని పలు రెస్టారెంట్లపై ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి ఆహారంలోని నాణ్యతను, వంట శాలల్లోని శుభ్రతపై క్షుణ్ణంగా పరిశీలించారు. శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లకు కస్టమర్లపట్ల జవాబుదారీతనాన్ని పెంచడం కోసం నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీచేయనుంది.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) హైదరాబాద్ చాప్టర్ హెడ్ సంపత్ తుమ్మల అధ్యక్షతన 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాలు నగరం అంతటా అమలయ్యేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రెస్టారెంట్లలో పరిశుభ్రత ప్రమాణాలను పెంచడానికి, ఈ 15 మంది సభ్యులతో కూడిన బృందం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) సహకారం కోరింది.
దీని కోసం ముందుగా రెస్టారెంట్లలో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు త్వరలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌ఆర్‌ఏఐ టాస్క్‌ఫోర్స్ సిద్దమైంది. పరిశుభ్రత గురించి అవగాహన పెంచడంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతా లోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది. పాడైపోయి, కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
తెలంగాణ ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ తనిఖీల సమయంలో కూడా వివిధ రెస్టారెంట్లలో కేవలం పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం అందించడంలో సమస్యలను గుర్తించిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. వీటిని నగరంలోని అన్ని రెస్టారెంట్లలో అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. ఈ వర్క షాపులు, శిక్షణా కార్యక్రమాలు పూర్తైన తరువాత కూడా పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత లేకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కమిటీ సభ్యులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.