“బుద్ధిగా ఉంటారా.. దారికి తెమ్మంటారా?” రౌడీషీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!

హైదరాబాద్‌ పాతబస్తీలో రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. "బుద్ధిగా ఉంటారా.. దారికి తెమ్మంటారా? "అంటూ రౌడీషీటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాల మేరకు సిటీలో అరాచక శక్తుల ఆటకట్టించేందుకు హైదరాబాద్ మహానగర పోలీసులు రంగంలోకి దిగారు. పాత నేరస్తుల జాతకాలు తీసి.. ప్రతి ఒక్కరి కదలికపై డేగ కన్ను వేశారు.

బుద్ధిగా ఉంటారా.. దారికి తెమ్మంటారా? రౌడీషీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!
Hyderabad Police

Edited By:

Updated on: Jan 30, 2026 | 9:51 AM

హైదరాబాద్‌ పాతబస్తీలో రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. “బుద్ధిగా ఉంటారా.. దారికి తెమ్మంటారా? “అంటూ రౌడీషీటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాల మేరకు సిటీలో అరాచక శక్తుల ఆటకట్టించేందుకు హైదరాబాద్ మహానగర పోలీసులు రంగంలోకి దిగారు. పాత నేరస్తుల జాతకాలు తీసి.. ప్రతి ఒక్కరి కదలికపై డేగ కన్ను వేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు నిఘా పెంచారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని పోలీసులు హెచ్చరించారు. ఫలక్‌నుమా ఏసీపీ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సాధారణ జీవితం గడపాలని, ఒకవేళ పంథా మార్చుకోకపోతే ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. కేవలం రౌడీషీటర్లకే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కుటుంబం సభ్యుల సహాకారం కూడా అవసరమని పోలీసులు తెలిపారు.

మరోవైపు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చార్మినార్‌ జోన్‌ డీసీపీ కారే కిరణ్‌ ప్రభాకర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పాతబస్తీలోని రౌడీ మూకలపై విస్తృత స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలో రెయిన్‌బజార్‌కు చెందిన రౌడీషీటర్‌ జఫర్‌ పహిల్వాన్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జఫర్‌ పరారీలో ఉన్నట్టు గుర్తించారు. జఫర్‌కు సంబంధించిన తనిఖీల్లో భాగంగా అతని కుమారులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

జఫర్‌ పహిల్వాన్‌ ఇంటిని డీసీపీ కారే కిరణ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలు ముట్టడించి సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఇంట్లో పదుల సంఖ్యలో మారణాయుధాలు బయటపడటం కలకలం రేపింది. జఫర్‌ పహిల్వాన్‌ పాతబస్తీలో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కోటను తలపించేలా ఇంటిని నిర్మించుకున్నాడని పోలీసులు తెలిపారు. సెటిల్మెంట్లు, అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తూ అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. తన పలుకుబడి ఉపయోగించి గతంలో ఆ ప్రాంతంలోని ఓ ప్రధాన రహదారికి తన పేరుపై ‘జఫర్‌ రోడ్‌’గా నామకరణం చేయించుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ రోడ్డుకు ‘నవాబ్‌ బహదూర్‌షా రోడ్‌’గా పేరు మార్చి, పాత బోర్డులను తొలగించి కొత్త బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇక పాతబస్తీలోని రౌడీషీటర్లు, పహిల్వాన్‌లకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేడీ పోలీసులు కూడా రంగంలోకి దిగుతూ నేరస్తుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులు, భార్యలతో మాట్లాడి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా 24 గంటల పాటు పాతబస్తీలోని రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో మరో రౌడీషీటర్‌ ఆయుబ్‌ ఖాన్‌పై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయుబ్‌ ఖాన్‌ తన కుమారులతో కలిసి ఓ వ్యక్తిని బెదిరించిన ఘటనలో కేసు నమోదు కాగా, పోలీసులు పిలిచినా విచారణకు హాజరుకావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందితో ఆయుబ్‌ ఖాన్‌ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆయుబ్‌ ఖాన్‌ సహా అతని కుమారులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పాతబస్తీలోని ప్రతి గల్లీలో ఆయుబ్‌ ఖాన్‌ వాంటెడ్‌ అంటూ పోస్టర్లు అతికించి, ఎవరికి అయినా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఆయుబ్‌ ఖాన్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని, భయంతో చాలా మంది ఫిర్యాదు చేయలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. బాధితులు ధైర్యంగా ముందుకొస్తే పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..