సాంకేతికత ఆధారంగా దొంగతనం జరగక ముందే పోలీసులు దొంగను పట్టుకున్నారు. అమెరికా(America)లో ఉన్న యజమాని.. హైదరాబాద్(Hyderabad) లోని తన ఇంట్లోకి ఎవరో ప్రవేశించినట్లు గుర్తించారు. ఇరుగుపొరుగు, పోలీసుల సహాయంతో చోరీ జరగకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ రెండో రోడ్డులోని ఎల్‌ఐజీ 237 ప్లాట్ యజమాని.. ఇంటికి తాళం వేసి అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో హైదరాబాద్ లోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఈ తనిఖీలో తమ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి దూరినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కలా వారికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా తలుపుకు తాళం పగులగొట్టి లోపల గడియ పెట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీయాలని దొంగను హెచ్చరించారు. అయినా తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికెళ్లారు. ఇంట్లో ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు.
చోరీ చేసిన నగదు, వెండి ఆభరణాలను బూట్లల్లో దాచి చాకును సోఫా కింద పడేసి పలు ఆభరణాలు మంచం పరుపు కింద దాచినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపర్లకు చెందిన తిప్పరాజు రామకృష్ణ గా గుర్తించారు. ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీ చేసి 10 సార్లు జైలుకి వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే ఓ కేసుకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యాడు.
Also Read