Hyderabad: రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సుమారు 32 మంది పలు బ్యాంకుల ఉన్నతాధికారుల, మేనేజర్‌లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరికి దేశ వ్యాప్తంగా మొత్తం 350 మ్యూల్‌ అకౌంట్స్‌, 850 కేసులతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

Hyderabad: రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Hyderabad Cybercrime

Updated on: Apr 20, 2026 | 11:04 AM

దేశంలోని నలుమూలలా లింకులున్న సైబర్‌ మోసాల భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేధించారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O పేరుతో 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లను పట్టుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌లకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారుల దోపిడీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 52మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరంతా పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కైన ఆయా బ్యాంకుల అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు అకౌంట్స్‌ తెరిచి.. వాటిని మ్యూల్ అకౌంట్స్‌గా వాడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు. ఈ అకౌంట్స్‌కు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్‌ కేసులతో సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఈ కేసుల్లో దాదాపు 150 కోట్ల రూపాయల వరకు మోసాలు జరిగినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌బాబు వెల్లడించారు.

అయితే.. ఈ సైబర్‌ క్రైమ్‌ మోసాలకు మ్యూల్‌ అకౌంట్సే మూల ఆధారమని తెలిపారు. ఒకరి అకౌంట్స్‌ను మరొకరికి ఇచ్చి సైబర్‌ నేరాలకు బలి కావొద్దని.. అత్యాశతో అనవసర లింకులను క్లిక్‌ చేసి మోసపోవద్దని డీసీపీ అరవింద్‌బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌గా భావించే మొదటి గంటలోపే ఫిర్యాదు చేస్తే.. డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని ప్రకటించారు. అనవసరంగా అత్యాశపడి కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేసుకోవద్దని.. సైబర్‌ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Follow Us