Minister KTR launches dial a septic tankers: హైదరాబాద్ మహానగరంలో మాన్యువల్ స్కావెంజింగ్ పద్థతికి స్వస్తి చెప్పడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. సెప్టేజ్ మేనేజ్‌మెంట్‌లో కొత్త ప్రయోగాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో ఖర్చుకు వెనకాడదన్నారు కేటీఆర్. సెప్టేజ్ మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో హైదరాబాద్ మహా నగర పారిశుధ్య నిర్వహణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుందన్నారు. నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
మానవ వ్యర్థాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే రోగాలు వచ్చే అవకాశం ఉందన్న కేటీఆర్.. శాస్ర్తీయమైన పద్దతుల్లో శుద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కాల్వల్లో మానవ వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రయత్నమన్నారు. వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ క్లీన్ హైదరాబాద్ కోసం పాటుపడుతున్నామని కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా దేశంలోని మరే మెట్రో సిటీల్లో లేనివిధంగా హైదరాబాద్ నగరంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పారిశుధ్య నిర్వహణ రంగంలోనూ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. నగరంలో వ్యర్థపదార్థాల నిర్వహణ (గార్బేజ్), భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ రంగంలో ఇప్పటికే ఆధునిక పద్దతిలో నిర్వహణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. అంతేకాకుండా దాదాపు కోటి జనాభాకు పైబడిన హైదరాబాద్ నగరంలో మల వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఈ ఫీకల్ స్లడ్జ్, సెప్టిక్ మేనేజ్ మెంట్ విధానంలో భాగంగా 87 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు.
ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఇప్పటికే 4వేలకు పైగా స్వచ్ఛ ఆటోలు, రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లు, చెత్త నుండి విద్యుత్ తయారీకి గాను జవహర్ నగర్ లో రెండు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలను జిహెచ్ఎంసి ద్వారా అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలో నేడు ద్రవ వ్యర్థాల నిర్వహణలో భాగంగా ప్రారంభించిన ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
Ministers @KTRTRS, @YadavTalasani & @mahmoodalitrs launched the Dial a Septic Tank Cleaner services & flagged off the Septic Tank Cleaner vehicles in Hyderabad. pic.twitter.com/EykyHlXGtI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 17, 2021
Read Also… Khairatabad Ganesha: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పనకు అంకురార్పణ.. ఈసారి ఎలా ఉండబోతున్నారంటే..