
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఓ తల్లి తన పిల్లలు రక్షించేందుకు చేసిన చివరి ప్రయత్నం కన్నీళ్లు పెట్టిస్తోంది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే ఆ ఇంట్లోకి వెళ్లిన స్థానికులు చూసిన ఆ విషాద దృశ్యం గురించి వాళ్లు చెబుతుంటే.. ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లడం ఖాయం.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే మేం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాం. ఓ గది ముందు భారీగా మంటలు అంటుకున్నాయి. అయితే ఆ గదిలో ఓ మహిళ తన పిల్లలు రక్షించుకునేందుకు చివరి ప్రయత్నంగా వారిని తన కౌగింట్లోకి తీసుకుంది. కానీ, దురదృష్టవశాత్తు వాళ్లు ఆ మంటల్లో కాలిపోయారు. మంటలు ఆర్పిన తర్వాత.. ఆ తల్లి, ఆమె కౌగిట్లో పిల్లలు అలాగే చనిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగలేదు అంటూ ప్రత్యక్ష సాక్షి జహీర్ వెల్లడించారు.
కాగా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. విద్యుత్ సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అంతా నిద్రపోతున్న సమయంలో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అలాగే భవన నిర్మాణ స్వభావం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ మార్కెట్‌లోని చాలా దుకాణాలు కనీసం ఒక శతాబ్దం నాటివి. వాటిపై గదులు కూడా చాలా ఇరుకుగా నిర్మించి ఉన్నాయి. దుకాణాల వరుస పైన వరుస కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలలో చాలా వరకు రాత్రిపూట ఎయిర్ కండిషనర్లు ఆన్‌లో ఉన్నప్పుడు మూసివేస్తూ ఉంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..