Hyderabad: వరకట్న వేధింపులు.. ఒక్క ఏడాదిలో హైదరాబాద్‌లోనే ఇంతమంది బలయ్యారా?

జనాల్లో రోజురోజుకూ డబ్బు పిచ్చి మరీ పెరిగిపోతుంది. వారికి మానవ సంబంధాల కన్నా.. డబ్బే ఎక్కువ ముఖ్యమైపోయింది. సమాజంలో పెరుగుతున్న వరకట్న వేధింపులే ఇందుకు నిదర్శనం.. వరకట్న వేధింపులతో కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే ఎంతో మంది మహిళలు బలైపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలో వరక్నట వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే!

Hyderabad: వరకట్న వేధింపులు.. ఒక్క ఏడాదిలో హైదరాబాద్‌లోనే ఇంతమంది బలయ్యారా?
Dowry Harassment Hyderabad

Edited By: Anand T

Updated on: Nov 16, 2025 | 12:46 PM

హైదరాబాద్‌లో వరకట్న వేధింపులు కారణంగా ఎంతో మంది గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు కట్నం కోరుతూ భర్తలు, వారి కుటుంబ సభ్యులు భార్యలను వేధించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టివ‌రకు 761 వరకట్న వేధింపుల కేసులు నమోదు కాగా, కేవలం పది నెలల వ్యవధిలోనే 16 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఈ బాధితుల్లో ఎక్కువ మంది పెళ్లి అయిన ఆరు నుంచి పది నెలల లోపే ఇలాంటి దారుణ పరిణామాలను ఎదుర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వరకట్నం పేరుతో మహిళలపై జరుగుతున్న హింసపై షీ టీమ్స్ అధికారులు అధ్యయనం చేశారు. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గ ముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తున్నందన్నారు.. మహిళలు భయపడకుండా, కుటుంబ సభ్యుల ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు పూర్తి సాయం చేస్తామని, వారి భద్రత కోసం అన్ని ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు.

వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు భరోసా కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, అత్యవసర సహాయం వంటి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వరకట్న వేధింపులు కనిపించగానే వెంటనే 100కు కాల్ చేయాలని, సమీప పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ విభాగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమాజంలో అవగాహన పెరగడం అత్యంత అవసరం. వరకట్నం డిమాండ్ చేయడం నేరమని ప్రతి కుటుంబం గ్రహించాలని, మహిళలపై హింసను అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.