
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్‌పై విసుగుతోనే ప్రజలు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పట్టాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రం బడ్జెట్‌లో కేటాయించిన 3900 కోట్ల రూపాయలు ఇవ్వలేదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే ఇచ్చారని కేసీఆర్ వివరించారు. జిఎస్‌టి నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని చట్టంలో చెప్పారు కానీ, అమలు చేయడం లేదన్నారు. ఒకప్పుడు రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేంద్రమే ఇచ్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపై భారం వేస్తున్నారని సీఎం కేసీఆర్ వివరించారు.
శాసనసభలో గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామాలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. గ్రామ బడ్జెట్‌లో 10 శాతం నిధులు పచ్చదనానికి వినియోగించాలనే నిబంధన పెట్టుకున్నామని, ఆ మేరకు గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.