Hyderabad: కారులో బయల్దేరిన 8 మంది స్నేహితులు.. గమ్యం చేరకుండానే..

హైదరాబాద్ నగర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరి కొందరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: కారులో బయల్దేరిన 8 మంది స్నేహితులు.. గమ్యం చేరకుండానే..
Hyderabad Road Accident

Updated on: Jan 28, 2026 | 3:26 PM

బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ నగర సమీపంలోని ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పై వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో సుమారు 8 మంది విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి వరుణ్‌, నిఖిల్, వెంకట్, రాకేశ్, యశ్వంత్‌, సాత్విక్‌, హర్షవర్ధన్‌, అభినవ్‌ అనే 8 మంది యువకులు కారులో బుధవారం ఉదయం మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్నారు. అయితే కారు వేగంగా ఉండడంతో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పైకి రాగానే అదుపుతప్పి 97వ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి వరుణ్‌, నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకట్, రాకేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. మిగతా స్నేహితులకు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వెంకట్‌, రాకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.