
Huzurabad Election – Etela Won: సాధారణంగా బైపోల్‌లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్‌పై ఛాలెంజ్ చేసి ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆత్మగౌరవం – అహంకారం నినాదం పేరుతో జరిగిన ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఈటలకే జీ హుజూర్ అన్నారు. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గినా.. విజయం దక్కించుకున్నారు. వ్యక్తిగత ఇమేజే ఈటలను బయటపడేసిందా? 6 సార్లు గెలిచిన అనుభవం పనిచేసిందా? విజయానికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న టాప్10 రీజన్స్ ఏంటో చూద్దాం.
1. సానుభూతి-ఆత్మగౌరవ నినాదం..
5 నెలల పాటు అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన హుజురాబాద్ పొలిటకల్ లీగ్‌లో ఈటలనే గెలుపు వరించింది. 2 రౌండ్లు మినహా అన్నింటిలోనూ లీడ్ కొనసాగించారు. నియోజవర్గంలోని 5 మండలాల్లోనూ ఆధిపత్యం చేలాయించారు. ఈటల విజయానికి ప్రధాన కారణం సానుభూతి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో జనాల్లో సాఫ్ట్‌కార్నర్ ఏర్పడింది. ఇక ఈటల అందుకున్న ఆత్మగౌరవ నినాదం కూడా బాగానే పనిచేసిందని చెప్పాలి.
2. ఈటలకు వ్యకిగతమైన ఇమేజ్..
ఈటల బీజేపీలో చేరినప్పటికీ ప్రజలు ఆయన్ను బీజేపీ నేతగా చూడలేదు. ఈటలను ఈటలగానే చూశారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆయన విజయానికి దోహదం చేసింది.
3.గ్యాస్, పెట్రో ధరల ప్రభావం లేకపోవడం..
ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. టీఆర్ఎస్ కూడా తన ప్రచారంలో ఈ అంశాలను పదేపదే ప్రస్తావించింది. కానీ ఆ ఎఫెక్ట్ ఓట్లపై పడలేదు.
4.రాజీనామా తర్వాత ప్రజల్లోనే ఉండటం..
ఈటల జూన్12వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రజల్లోనే ఉన్నారు. నియోజకవర్గం దాటి బయటకు రాలేదు. పాదయాత్రతో అన్ని మండలాలనూ చుట్టేశారు. ఇంటింటికీ వెళ్లారు. ప్రతి ఓటరును కలిశారు.
5. కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు..
క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఈటలకు కలిసొచ్చాయి. బీసీ ఓట్లు పెద్దసంఖ్యలో పడ్డాయి. ఆయన భార్య కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అందుకే రెడ్డి సామాజికవర్గం కూడా ఈటలకు అండగా నిలిచింది.
6. గెల్లు ఈటలకు సరితూగలేదనే భావన..
ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఈటలకు దీటైన అభ్యర్థిగా ప్రజలు భావించలేదనే చెప్పాలి. పైగా ఒకప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈటల ప్రధాన అనుచరుడు. దీంతో ఓటర్లు సీనియార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు.
7. ఈటలకు మళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంక్..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి నుంచి వెనుకంజలోనే ఉంది. జస్ట్ పోటీలో ఉన్నారంటే ఉన్నారంతే. బల్మూరి వెంకట్ లాంటి బలహీనమైన క్యాండిడేట్‌ను పెట్టడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లింది.
8. దళితబంధుతో ఇతర కుల్లాల్లో అసంతృప్తి..
దళితబంధు పథకం రివర్స్ అయినట్లు కనిపించింది. ప్రభుత్వానికి అనుకూలంగా మారాల్సింది పోయి ఈటలకు ప్లస్‌పాయింట్ అయింది. అసంతృప్తితో ఉన్న ఇతర కులాల ఓట్లు ఈటల వైపు మళ్లాయి.
9. ఆరుసార్లు గెలిచిన అనుభవం..
ఈటలకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. సొంత గ్రామం కమలాపూర్‌లోనూ తిరుగులేని ఓటు బ్యాంక్ ఉంది. పైగా ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. ఇవన్నీ మరోసారి కలిసొచ్చాయి.
10. నియోజకవర్గంలో పరిచయాలు..
ఈటలకు నియోజకవర్గంలోనూ వ్యక్తిగత పరిచయాలున్నాయి. మొత్తం 5 మండలాల్లోనూ వ్యాపారవేత్తలు, రైతులు, కులసంఘాల నేతలు… ఇలా అందరితోనూ మంచి సంబంధాలున్నాయి. పార్టీలకు అతీతంగా ఆ ఓట్లన్నీ ఈటలకు పడ్డాయి.
(టీవీ9, న్యూస్ డెస్క్)
Also read:
Railway Passengers: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇప్పుడు ATVM స్మార్ట్ కార్డ్ చెల్లుతున్నాయ్..
Health News: ఈ ఫుడ్ తింటున్నారా జాగ్రత్త..! పెద్దపేగు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం..