Huzurabad By-Poll: హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయం మరింత వేడెక్కుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరును ఖరారు చేయడంతో రాజకీయ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్న ఎల్.రమణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరిన ఎల్.రమణ కు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు రమణను శాలువలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ను టిఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తే..ఈటల రాజేందర్ బీసీలను బానిసలంటూ మాట్లాడడం తగదన్నారు. బీసీలను కించపరిచేలా ఈటెల వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం వ్యక్తంచేశారు. బీసీలనుద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల వెంటనే ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మూడవ సారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా రాష్ట్ర రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని రమణ అన్నారు.
ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ: తలసాని
అటు ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను ఈటల బానిస అనడం సరికాదన్నారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ చిల్ల పిల్లవాడే కావచ్చుకానీ.. ఆనాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు ఈటల చిన్నవాడే కదా అన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అని వ్యాఖ్యానించారు. గతంలో ఆరుసార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై ఈటల విజయం సాధించిన విషయం మర్చిపోయరంటూ మంత్రి తలసాని ధ్వజమెత్తారు.
అటు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తంచేశారు. ఆయనతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇక్కడ చూడండి.
Also Read..