Huzurabad by poll: ఉప పోరు జోరందుకున్న రాజకీయం.. ఇప్పటివరకు 9 నామినేషన్లు.. ఈసీ కండీషన్స్‌పై అభ్యర్థుల గుర్రు

Huzurabad by Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ఊపందుకుంది. ఇవాళ మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి.

Huzurabad by poll: ఉప పోరు జోరందుకున్న రాజకీయం.. ఇప్పటివరకు 9 నామినేషన్లు.. ఈసీ కండీషన్స్‌పై అభ్యర్థుల గుర్రు
Huzurabad By Poll

Updated on: Oct 06, 2021 | 6:10 PM

Huzurabad by Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ఊపందుకుంది. ఇవాళ మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయని హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల అధికారి తెలిపారు. కాగా, ఈ నెల 8న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా..అక్టోబరు 30న పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

హుజూరాబాద్‌లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ బరిలోకి దిగుతారు. కాంగ్రెస్‌ నుంచి బల్మూర్ వెంకట నర్సింగరావు బరిలో నిలిచారు. ఇదిలావుంటే బీజేపీ డమ్మీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ సతీమణి జమున పేరిట ఆ పార్టీ కార్యకర్తలు నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా చిల్వేరు శ్రీకాంత్‌, రేగుల సైదులు నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు, హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ప్రభుత్వం తమను 2020లో నిర్దాక్షిణ్యంగా తొలగించిందని.. అందుకు నిరసనగా బై పోల్‌లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటే పోటీ నుంచి తప్పుకుంటామని చెబుతున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 30న పోలింగ్‌, నవంబరు 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. నవంబరు 5తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్ని పార్టీల ఇజ్జత్‌కీ సవాల్‌గా మారాయి. మరి బైపోల్‌లో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందా. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఫౌండేషనుగా భావిస్తున్నాయి.

ఇదిలావుంటే, హుజురాబాద్‌ అభ్యర్థులను కోవిడ్ సర్టిఫికేట్ టెన్షన్ వెంటాడుతోంది. డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. అభ్యర్థితోపాటు వారిని బలపరిచే వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలన్న నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also…  AP High Court on TTD: టీటీడీ బోర్డు కొత్త సభ్యులకు షాక్.. 18 మందికి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు