
Telangana: భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు, అత్తమామలు ఉన్న ఇంటికి అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా భార్యకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆ దారుణాన్ని చూపించాడు. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో అర్థరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది.
మద్యం మత్తు అదనపు కట్నం వేధింపులు. చివరకు కన్నపిడ్డలను, భార్యను సజీవ దహనం చేసే స్థాయికి అతన్ని దిగజార్చాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు, దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన కొంతకాలానికే నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్య లావణ్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.
ఇది కూడా చదవండి: Telangana: మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
భర్త వేధింపులు భరించలేక లావణ్య కొన్ని నెలల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకొని దౌలాపూర్‌లోని పుట్టింటికి వచ్చేసింది. అయినా నాగరాజులో మార్పురాలేదు. పుట్టింటికి వెళ్లిన భార్యకు ఫోన్లు చేస్తూ, కాపురానికి రాకపోతే చంపేస్తానంటూ వరుసగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న అర్ధరాత్రి నాగరాజు దౌలాపూర్‌లోని అత్తగారింటికి చేరుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇల్లు పక్కన ఉన్న గుడిసెకి నిప్పు పెట్టాడు.
గుడిసెతో పాటు ఇల్లు కూడా తగలబడి పోయేలా ప్లాన్ వేశాడు. ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరూ బయటకు రాకుండా తలుపులు గడియపెట్టాడు. ఆ తర్వాత భార్య లావణ్యకు వీడియో కాల్ చేసి మీ ఇల్లు తగలబడుతోంది చూడు అంటూ వికృత ఆనందం పొందాడు. గుడిసెలో నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని పక్కింటి వారు గమనించారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో.. లోపల ఉన్న అత్తమామలు, లావణ్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఊహించని ఈ ప్రమాదం నుంచి వారంతా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి