Telangana: కిరాతక భర్త.. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే దారుణ హత్య..
ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను అతి కిరాతకంగా నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. కేవలం డబ్బుల కోసం కట్టుకున్న భార్యను కడతేల్చాడు ఈ కిరాతకుడు.. గత కొంతకాలంగా భార్య పుట్టింట్లో ఉంటుంది. కక్ష పెంచుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఆరు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న భార్యపై కక్ష పెంచుకున్న ఓ భర్త నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో చోటుచేసుకుంది. భార్యను కాపాడేందుకు అడ్డువచ్చిన అత్తపైనా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పదిర గ్రామానికి చెందిన జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సిద్దు, బన్నీ, కుమార్తె దీక్ష ఉన్నారు. కొంతకాలంగా బంగారం, వెండి అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ సురేష్ భార్య జ్యోతితో గొడవపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలోనూ జ్యోతిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు వారు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక జ్యోతి ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చి తల్లి ఎల్లవ్వ వద్ద ఉంటోంది.
అయితే జ్యోతి తన మాట వినడం లేదన్న కక్షతో సురేష్ ఆమెపై ఆగ్రహం పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న విషయం తెలుసుకున్న సురేష్.. పదిర గ్రామ శివారులో కారులో కాపుకాసినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో జ్యోతి, ఎల్లవ్వ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన సురేష్ వెంట తెచ్చుకున్న కత్తితో జ్యోతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని కాపాడేందుకు ఎల్లవ్వ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపైనా కత్తితో దాడి చేశాడు. జ్యోతి పొట్ట, ఛాతి, చేతులపై తీవ్రంగా కత్తిపోట్లు పడటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఎల్లవ్వ కాలు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
తల్లీకూతుళ్ల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో సురేష్ కారులో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు బండరాళ్లతో కారును అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకుని పారిపోయాడు. అనంతరం సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను తొలుత సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
