Haryana Violence: హర్యానాలో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేత.. హైకోర్టు ఏం చెప్పిందంటే

ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీశాయి. హర్యానాలో కేవలం ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోని కూల్చివేతలు చేస్తున్నారని.. ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేతల చర్యలపై మండిపడ్డారు. మరోవైపు కూల్చివేతలపై హర్యానా ప్రభుత్వం కూడా స్పందించింది.

Haryana Violence: హర్యానాలో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేత.. హైకోర్టు ఏం చెప్పిందంటే
House Demolished

Updated on: Aug 07, 2023 | 5:24 PM

ఇటీవల హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అల్లర్లకు పాల్పడిన నిందితులపై అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్‌కు దిగింది. అక్రమంగా వలస వచ్చి ఉంటున్న గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేసింది. అయితే ఈ చర్యలకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టులు స్పందించాయి. వెంటనే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేసే పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఈ ఆదేశాల మేరకు బుల్డోజర్లతో భవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ చర్యలను ఆపాలంటూ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల హర్యానాలో మత ఘర్షణలు చలరేగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుంది. ఆ తర్వాత దీనిపై విచారణ చేపట్టింది. మరో విషయం ఏంటంటే ఇప్పటికే బుల్డోజర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం దాదాపు 350 వరకు గుడిసెలను, అలాగే 50 వరకు సిమెంట్ నిర్మాణాలను కూల్చివేసింది.

అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీశాయి. హర్యానాలో కేవలం ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోని కూల్చివేతలు చేస్తున్నారని.. ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేతల చర్యలపై మండిపడ్డారు. మరోవైపు కూల్చివేతలపై హర్యానా ప్రభుత్వం కూడా స్పందించింది. తాము కేవలం అక్రమంగా కట్టిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని చెబుతోంది. చట్టం ప్రకారం ఉన్నటువంటి ఇళ్ల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. కేవలం అక్రమంగా నివాసం ఉంటున్న వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను కూడా ఆదివారం రోజున బుల్డోజర్లు కూల్చివేశాయి. అలాగే ఇదే భవనం పై నుంచి కొంతమంది అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పటికే నాలుగు రోజుల పాటు కొనసాగుతున్న ఈ బుల్డోజర్ యాక్షన్ ప్రక్రియలో దాదాపు 50 నుంచి 60 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఘటనాస్థలానికి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలను అలాగే కొన్ని మందుల షాపులు కూడా కూల్చివేశారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఇటీవల విశ్వ హిందూ పరిషత్ రథయాత్ర జరిగింది. అలా ఆ యాత్ర సాఫీగా జరుగుతున్న తరుణంలో అల్లరి మూకలు రాళ్ల దాడి చేశారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు చెలరేగాయి. అలాగే ఆందోళనకారులు వాహనాలను నిప్పంటించారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న దాదాపు 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. మరో విషయం ఏంటంటే అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడంతో అల్లర్ల తీవ్రత మరింత పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..