
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 55 ను జారీ చేసింది.
జనగణన–2027 కోసం జూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమలులో ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ పునర్విభజన చట్టవిరుద్ధం అంటూ దరం గురువ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2027 జనగణన నేపథ్యంలో.. అది పూర్తయ్యేవరకు ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిబంధనలు విధించినట్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని కోరారు. దీనిపై గురువారం (ఫిబ్రవరి 19) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. కౌంటర్లు దాఖలైన అనంతరం ఈ కేసును తదుపరి విచాణకు స్వీకరిస్తామని తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారిగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం, నగర విస్తీర్ణాన్ని ఏకంగా 2వేల చదరపు కిలోమీటర్లకు పెంచడం.. దేశంలోనే అతి పెద్ద నగరంగా మార్చడం.. ఇదంతా కేవలం పరిపాలనా సంస్కరణల కోసమే అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశాక.. గ్రేటర్‌లో ఇంత పెద్ద మార్పులు జరగడం ఇదే ఫస్ట్‌టైమ్.
GHMC విస్తరణతో పాటే రాజకీయ రణం కూడా మొదలైంది. మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ఏకపక్షంగా ఎలా విభజిస్తారు అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. GHMC విభజన, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. వార్జుల డీలిమిటేషన్ అస్తవ్యస్తంగా ఉందని, ఏవిధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. పొలిటికల్ వార్ అటుంచితే, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. ప్రజలకు మరింత బెటర్ సర్వీసెస్ ఇచ్చేందుకే ఈ మార్పులు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..